` కమర్షియల్ చిత్రాలకు కూడా మ్యూజిక్ చేయగలనని `జాంబిరెడ్డి` ప్రూవ్ చేసిందిః యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరక్టర్ మార్క్ కె రాబిన్
` కమర్షియల్ చిత్రాలకు కూడా మ్యూజిక్ చేయగలనని `జాంబిరెడ్డి` ప్రూవ్ చేసిందిః యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరక్టర్ మార్క్ కె రాబిన్
మార్క్ కె.రాబిన్ … పేరు లోనే కాదు, తన మ్యూజిక్ తో కూడా తనకంటూ ఓ సపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరక్టర్. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి నాని నిర్మించిన `అ` సినిమాతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత `సూర్యకాంతం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మల్లేశం లాంటి డిఫరెంట్ చిత్రాలకు మ్యూజిక్ చేసి తన మార్క్ ని నిలబెట్టుకున్నాడు . ముఖ్యంగా `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రానికి చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోరుకి విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న `జాంబిరెడ్డి` చిత్రానికి మ్యూజిక్ చేసి… కమర్షియల్ చిత్రాలకు కూడా మ్యూజిక్ చేయగలనని ప్రూవ్ చేసుకున్న మార్క్ కె రాబిన్ తో ఇంటర్య్వూ ఆయన మాటల్లో…
ఫస్ట్ సినిమా అవకాశం ఎలా లభించింది?
నేను, డైరక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి `డైలాగ్ ఇన్ ద డార్క్` అని ఒక ప్రయోగం చేశాం. అలాగే `జి ` సినిమాలు ఛానల్ కు కొన్ని ప్రొగ్రామ్స్ చేశాం. ఆ సమయంలో ప్రశాంత్ తో నాకు ర్యాపో పెరిగింది. మా ఐడియాలజీ కూడా చాలా దగ్గరగా ఉండటంతో మా ఇద్దరి జర్నీ ప్రారంభమైంది. అలాంటి తరుణంలో నాని గారు నటించిన `మజ్ఞు` సినిమా మ్యూజిక్ డైరక్టర్ కొంచెం బిజీగా ఉండటంతో ట్రైలర్ కి మ్యూజిక్ చేయించడానికి వేరే వాళ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. చాలా అర్జంట్ . పెద్ద మ్యూజిక్ డైరక్టర్స్ అంతా బిజీగా ఉంటారు కాబట్టి, ఆ స్థాయిలో చేసే వాళ్ల కోసం సెర్చ్ చేస్తోన్న సమయంలో నాని గారిని నా స్టూడియోకు తీసుకొచ్చారు డైరక్టర్ ప్రశాంత్ వర్మ. నాని గారు చాలా సింపుల్ గా ఒక బైక్ లో వచ్చారు. ఆయన అలా రావడం చూసి చాలా ఆశ్యర్యం వేసింది. నాని గారిని రిసీవ్ చేసుకుని స్టూడియోలోకి తీసుకెళ్లి ఆయన ముందే ఒక ప్యాట్రన్ కంపోజ్ చేసి వినిపించాను. నాని గారికి బాగా నచ్చింది. సూపర్… ఈ స్టైల్ లో నే ట్రైలర్ అంతా కంప్లీట్ చేసేయండి అన్నారు. అంతలో కరెంట్ పోయింది. యుపియస్ కూడా కొనలేని పరిస్థితి నాది. నాని గారిని అలా వెయిట్ చేయించడం నాకే ఇబ్బందిగా అనిపించింది. ఇక నైట్ అంతా కూర్చోని కంప్లీట్ చేసి ఇచ్చాను. మొత్తం ట్రైలర్ మ్యూజిక్ విన్నాక `ఇన్ని రోజులు ఎక్కడువన్నావు` నీ మ్యూజిక్ స్టైల్ బావుంది అన్నారు నానిగారు. అది నాకు మంచి కాంప్లిమెంట్ లా అనిపించింది. కచ్చితంగా మనం కలిసి పని చేద్దాం అని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం `అ` సినిమా అవకాశం ఇచ్చారు.. `అ` సినిమా డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కింది కాబట్టి ఆ సినిమా కోసం నేను లాటిన్, జాజ్ మ్యూజిక్ నేర్చుకుని ఆర్.ఆర్ చేశాను. `అ` సినిమా నాకు మంచి లెర్నింగ్ అయింది.
`అ` సినిమా మీకు ఎలాంటి గుర్తింపునిచ్చింది?
`అ ` సినిమాకు మంచి గుర్తింపు లభించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోరు గురించి ప్రత్యేకంగా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక నా రెండో సినిమాగా నారా రోహిత్, విష్ణు నటించిన ` వీరభోగ వసంతరాయలు` సినిమా రిలీజైంది. ఆ తర్వాత మెగాడాటర్ కొణిదెల నిహారిక నటించిన `సూర్యకాంతం` సినిమాకు మ్యూజిక్ చేశాను. అందులో `పోరా పోవే`, సిధ్దు శ్రీరామ్ పాడిన `ఇంతేనా ఇంతేనా` పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రాలకు ఒకేసారి వర్క్ చేశాను.
`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` దర్శకుడు స్వరూప్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ?
స్వరూప్ గారి ఐడియాలజీ, థాట్ ప్రాసెస్ , నేరేట్ చేసే విధానం ఎక్స్టార్డినరీ గా ఉంటుంది. ఏ సన్నివేశానికి ఎలాంటి ఆర్ ఆర్ చేయించుకోవాలి? అది మళ్లీ ఎక్కడ రిపీట్ చేయాలి? అనేది బాగా తెలుసు. ఆర్ ఆర్ విషయంలో మంచి క్లారిటీ , గ్రిప్ ఉన్న వ్యక్తి. నేనే కాదు ఆయన సినిమాకు ఏ మ్యూజిక్ డైరక్టర్ చేసినా అది కచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన మన దగ్గర నుంచి వర్క్ తీసుకునే విధానం అంత బావుంటుంది.
సాంగ్ కంపోజింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తం మీరే చేసుకుంటారా? లేకుంటే వేరే కీ బోర్డ్ ప్లేయర్స్ ని తో చేయిస్తారా?
లేదండీ ఇప్పటి వరకు నా ప్రతి సినిమా పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నేను చేసుకున్నదే తప్ప ..ఎవరితో చెప్పి చేయించుకోలేదు. నేను చేస్తేనే నాకు ఆ శాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నేనే చేసుకున్నాను. ఎక్కువ సినిమాలు, టైమ్ లిమిట్ ఉన్నప్పుడు మరొకరికి చెప్పి చేయించుకునే అవసరం ఏర్పడుతుంది.
ఎమ్మెస్ రాజు లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
ఎమ్మెస్ రాజు గారు చాలా స్వీట్ పర్సన్. `డర్టిహరి` సినిమాకు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా చూసి నువ్వు ఏం ఫీలవుతావో అలా మ్యూజిక్ చేయి అన్నారు. నేను ఫుల్ గా మ్యూజిక్ చేసి వినిపించాను..చిన్న మార్పులు తప్ప పెద్దగా ఏమీ చెప్పలేదు. చాలా మంది ఎమ్మెస్ రాజు గారు చాలా సతాయిస్తారు…వర్క్ చేయలేవు అని మొదట్లో భయపెట్టారు. ఆయనతో వర్క్ చేశాక నాకేమి అనిపించిందంటే…ఆయన ఏం కోరుకుంటున్నారో దాన్ని క్యాచ్ చేసి అది ఆయనకు ఇచ్చేస్తే సరిపోతుందని. నేను ఆర్ ఆర్ చేస్తుంటే ఆ వర్క్ ని ఆయన చాలా చిన్నపిల్లాడిలా ఎంజాయ్ చేసేవారు. సినిమా పట్ల ప్రతి విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంటారు అందుకే అందరూ ఆయనతో వర్క్ చేయడం కష్టం అంటుంటారు అనుకుంటా. నేను అయితే ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీలయ్యా. డర్టిహరి బ్యాక్ గ్రౌండ్ స్కోరుకి కూడా మంచి పేరొచ్చింది. నా వర్క్ నచ్చి నెక్ట్స్ కూడా కలిసి పని చేద్దాం అన్నారు రాజు గారు.
`జాంబిరెడ్డి` సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నట్టున్నారు?
అవునండీ. ఎందుకంటే నేను ఇంత వరకు చేసిన సినిమాలన్నీ ప్రయోగాత్మక చిత్రాలే. అన్నింటికి మంచి పేరొచ్చింది. కానీ, జాంబిరెడ్డి సినిమాతో `కమర్షియల్` మ్యూజిక్ కూడా చేయగలడు అని అందరికీ అర్ధమైంది. చూసిన ప్రతి ఒక్కరూ బ్యాక్ గ్రౌండ్ స్కోరు గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మీడియా వారు ఎంతో ప్రశంసిస్తున్నారు. రివ్యూస్ లో ప్రత్యేకంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరు గురించి ప్రస్తావించడం చాలా హ్యాపీగా ఉంది. జాంబీలతో ఇలా కూడా సినిమా తీయొచ్చా అనే విధంగా సినిమా తీసి సక్సెస్ చేయగలిగారు మా డైరక్టర్. హీరో తేజు కూడా చాలా బాగ నటించాడు. ప్రశాంత్ తో వర్క్ చేయడం ఎప్పుడూ థ్రిల్లింగ్ గా నే ఉంటుంది. ఇక జాంబిరెడ్డి సినిమాకు చేసిన ఆర్ ఆర్ నచ్చి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది ప్రముఖుల ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. పెద్ద సంస్థల నుంచి అవకాశాలు కూడా వస్తున్నాయి.
మీ ప్రతి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోరు పరంగా మంచి మార్కులు పడుతున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోరు పై మీకు ఇంత గ్రిప్ ఎలా వచ్చింది?
ఏం లేదండీ.. నేను సినిమాకు కమిటైన దగ్గర నుంచి డైరక్టర్ తో ట్రావెల్ అవుతాను. స్క్రిప్ట్ తీసుకొని టైమ్ కుదిరినప్పుడల్లా చదువుతుంటాను. ఎప్పుడు ఏ ఐడియా వచ్చినా దాన్ని కంపోజ్ చేసి పెట్టుకుంటాను. రష్ నా దగ్గరకు వచ్చే లోపు నేను కొన్ని థీమ్స్ రెడీ చేసి పెట్టుకుంటాను. సినిమా చూశాక వాటిని డెవలప్ చేస్తూ సినిమాకు తగ్గట్టుగా ఆర్ ఆర్ చేస్తుంటాను. అలాగే కథలోకి, క్యారక్టర్స్ లోకి వెళతాను. సబ్జెక్ట్ ని అడాప్ట్ చేసుకుంటాను. డైరక్టర్ మైండ్ లోకి వెళతాను. ఆర్. ఆర్ పూర్తయేంత వరకు పని తప్ప మరో ప్రపంచం ఉండదు. నాకు పర్సనల్ గా కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంటే చాలా ఇష్టం. అందుకే నేపథ్య సంగీతం బాగా చేయగలుగుతున్నా అనుకుంటా.
మామూలుగా కొంత మంది డైరక్టర్స్ రిఫరెన్స్ ఇచ్చి , ఇలా చేయండి అంటుంటారు, వాటిని తీసుకుంటారా?
కొంత మంది డైరక్టర్స్ నాకు ఈ మ్యూజిక్ కావాలి, ఈ ఇన్ స్ట్రుమెంట్స్ కావాలని చెప్పలేరు కాబట్టి , వాళ్లు కొన్ని మ్యూజిక్ రిఫరెన్స్ లు ఇస్తుంటారు. దాని ద్వారా డైరక్టర్ కి ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకుని నా స్టైల్లో నేను వారికి కావాల్సింది ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను.
పర్టిక్యులర్ గా జాంబిరెడ్డి సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి బాగా మాట్లాడుతున్నారు , ఎందుకు అనుకుంటున్నారు?
నేను జాంబీస్ సినిమాకు పెద్ద ఫ్యాన్ ని. అలాంటి స్టోరీతో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా జాంబిరెడ్డి. ఈ స్టోరీ ప్రశాంత్ చెప్పినప్పుడే నేను జాంబీస్ కి సంబంధించిన ఆర్టికల్స్ చదవడం, జాంబీస్ గురించి తెలుసుకోవడం ప్రాంరభించాను. అలా అని జాంబీస్ సినిమాలు ప్రత్యేకంగా చూడలేదు. చూస్తే మళ్లీ ఆ ఇన్ ఫ్లుయన్స్ పడుతుందని. అందులో ఈ జాంబిరెడ్డి సినిమా మొత్తం కూడా డిపరెంట్ బ్యాక్ డ్రాప్. అందులో బ్యాక్ గ్రౌండ్ స్కోరు కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమా కావడంతో అంత మంచి పేరొచ్చింది అనుకుంటున్నా.
మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారు?
నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. సంగీతంలో కావలి జోవెల్ కుమార్ గారు నాకు గురువు. ఆయన దగ్గరే గిటార్ నేర్చుకున్నాను. నేను చేసే ప్రతి పాట ఆయనకు పంపిస్తాను. ఆయన సాంగ్ బాగుంది అన్నా కూడా, ఆ సాంగ్ నెక్ట్స్ లెవల్ లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఒక పట్టాన ఆయనకు ఏదీ నచ్చదు. నా దగ్గర ఫీజు కూడా తీసుకోకుండా మ్యూజిక్ నేర్పించారు. పైగా నాకు గిటార్ కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఆయన గాడ్ ఫాదర్.
ట్రెడిషనల్ మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నారు?
నేను ఏ ట్రెడిషనల్ మ్యూజిక్ నేర్చుకోలేదు. ఏదైనా ఒకటి పర్టిక్యులర్ గా నేర్చుకున్నామంటే అందులోనే ఉండిపోతాం. అవే చేస్తుంటాం. కాబట్టి అలా కాకుండా నాకు ఏది కావాలంటే దాన్ని పిక్ చేసుకుంటా. మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటా. కానీ కర్ణాటిక్, హిందుస్తాని, వెస్ట్రన్ మ్యూజిక్ తో పాటు రాగాలపైనా మంచి అవగాహన ఉంది. ఇటీవల ఒకరు అడిగారు `మీ దగ్గర మ్యూజిక్ టెంప్లేట్ ఏమైనా ఉంటే పంపిస్తారా?` అని. నేను ఆయనకు చెప్పాను `అలా నేను చేయను, మీరు కూడా చేయకండి. ప్రతి ప్రాజెక్ట్ తెల్ల కాగితం అనుకొని పని ప్రారంభించాలి అని చెప్పాను. కొత్తగా ఆలోచించడం, కొత్తగా ట్రై చేయడం అంటే నాకు ఇష్టం.
మ్యూజిక్ డైరక్టర్ కావాలన్న కోరిక ఎప్పుడు కలిగింది?
`వినాయకుడు` మూవీ మ్యూజిక్ డైరక్టర్ శ్యామ్ ప్రశాంత్ నాకు కజిన్ అవుతారు. ఆ సినిమాకు సంబంధించి వర్క్ జూబ్లిహిల్స్ లోని ఓ స్టూడియోలో జరిగేది. అలా నేను మా కజిన్ తో స్టూడియోకి వెళ్లేవాణ్ని. ఆ అట్మాస్పియర్ అంతా నాకు చాలా నచ్చింది. అప్పుడే మ్యూజిక్ డైరక్టర్ అవ్వాలని ఫిక్సయ్యాను.
మిమ్మల్ని ఇన్ స్పైర్ చేసే మ్యూజిక్ డైరక్టర్స్?
ఇళయరాజా గారు, రెహమాన్ గారు మనకు మ్యూజిక్ లో మనకు స్ట్రాంగ్ పిల్లర్స్ లాంటివారు. మనకు జాజ్ మ్యూజిక్ పరిచయం చేసింది ఇళయరాజాగారే. జాజ్ మ్యూజిక్ లో ఫోక్ సాంగ్ చేసింది కూడా ఆయనే. ఇళయరాజా గారు నాకు టెక్ట్స్ బుక్ లాంటి వారు. రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రమే కాదు ఆయన మనస్తత్వం కూడా నాకు చాలా ఇష్టం. ఆయనలా ఉండటం అంటే మామూలు విషయం కాదు. వీరిద్దరి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
స్టార్ హీరోలతో వర్క్ చేయడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా?
చిన్నా, పెద్ద హీరోలని కాదు అందరితో వర్క్ చేయాలని ఉంది. ఒక్కో యాంగిల్ లో ఒక్కో హీరో ఇష్టం. అందరికన్నా సినిమాకు నేను పెద్ద ఫ్యాన్ ని. బిగ్ స్టార్స్ తో , డైరక్టర్స్ తో వర్క్ చేయడానికి నేనూ వెయిట్ చేస్తున్నాను. ప్రజంట్ ప్రయోగాత్మక చిత్రాలు , డిఫరెంట్ మూవీస్ చేస్తూ వర్క్ ఎంజాయ్ చేస్తున్నా. ఇండస్ట్రీలో రాబిన్ ఎక్స్ పర్మెంట్ సినిమాలే చేస్తాడేమో , కమర్షియల్ సినిమాలు చేయడేమో అనే ఒక టాక్ ఉంది. అలా కాదు అన్ని రకాల సినిమాలు, మ్యూజిక్ చేస్తాను. `జాంబి రెడ్డి` సినిమాకు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మ్యూజిక్ కొట్టాను. అది కూడా నా మార్క్ మిస్సవకుండా కొట్టాను. అందరూ రిసీవ్ చేసుకున్నారు. కమర్షియల్ మ్యూజిక్ చేయడం అన్నది పెద్ద మ్యాటర్ కాదు, అందులో కూడా ఎంత కొత్తదనం చూపించడం అన్నది మ్యాటర్.
మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
స్వరూప్ డైరక్షన్ లో మ్యాట్నీ బేనర్ లో `మిషన్ ఇంపాజిబుల్` చేస్తున్నా. అలాగే మారుతి బేనర్ లో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నా. పలాస హీరో తో ఒక సినిమా. సుమంత్ హీరోగా నటిస్తోన్న ` అనగనగా ఒక రౌడి` సినిమా చేస్తున్నా. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ లో ఉన్నాయి. పెద్ద బేనర్ లో ఒక సినిమా ఉంది. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తా.