Undiporaadhey Movie Press Meet
షూటింగ్ పూర్తి చేసుకున్న ` ఉండిపోరాదే`
గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై తరుణ్ తేజ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నవీన్ నాయని దర్శకత్వంలో డా.లింగేశ్వర్ నిర్మిస్తోన్న చిత్రం `ఉండిపోరాదే`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“టైటిల్ బావుంది. తండ్రీ- కూతుళ్ల మధ్య అనుబంధం మీద సినిమా అంటే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. నిర్మాత తొలి సినిమానే అభిరుచితో తీయడం గొప్ప విషయం. ఇటీవల కాలంలో చిన్న సినిమాలు, కొత్త వాళ్లతో చేసే సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఆ కోవలో ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా“ అన్నారు.
ఏపి ఫిలించాంబర్ సెక్రటరీ మోహన్ గౌడ్ మాట్లాడుతూ…“ఉండిపోరాదే` ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. దాన్ని సినిమా టైటిల్ గా పెట్టడంతోనే సగం సక్సెస్ అయ్యారు దర్శక నిర్మాతలు. ప్రజంట్ చిన్న సినిమాలకు మంచి రోజుల వచ్చాయని చెప్పాలి. అంతా కొత్తవారు చేస్తోన్న ఈ ప్రయత్నం ఫలించాలనీ, వీరికి మరెన్నో సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా“ అన్నారు.
మాటల రచయిత సుబ్బారాయుడు బొంపెం మాట్లాడుతూ…“మా నిర్మాత లింగేశ్వర్ గారు ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకుని ఒక మంచి లైన్ చెప్పారు. దాన్ని నేను, డైరక్టర్ కలిసి డెవలప్ చేసాం. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. మాటలు కూడా చాలా సహజంగా కుదిరాయి. ఈ సినిమాతో అందరికీ మంచి పేరొస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
సంగీత దర్శకుడు సబు వర్గీస్ మాట్లాడుతూ…“ఇందులో ప్రతి పాట సందర్భానుసారంగా సాగేదే. దర్శక నిర్మాతలు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో మంచి పాటలు ఇవ్వగలిగాను“ అన్నారు.
నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ…“ఇందులో కర్కోటకుడైన కాలేజ్ లెక్చరర్ పాత్రలో నటించాను. దర్శకుడు నాకు చాలా కాలంగా పరిచయం. సినిమాను చాలా బాగా డీల్ చేసాడు. నిర్మాత రాజీ పడకుండా నిర్మించారు“ అన్నారు.
హీరో తరుణ్ తేజ్ మాట్లాడుతూ…“ఇంత మంచి సినిమాలో హీరోగా అవకాశం కల్పించిన మా నిర్మాతకు ధన్యవాదాలు“ అన్నారు.
హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ…“ఇందులో నా పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ సినిమాలోనే పర్ఫార్మెన్స్ స్కోపున్న పాత్ర చేయడం లక్కీగా ఫీలవుతున్నా“ అన్నారు.
దర్శకుడు నవీన్ నాయని మాట్లాడుతూ…“నన్ను నమ్మి డైరక్టర్ గా అవకాశం ఇచ్చిన మా నిర్మాతకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఇదొక రియలిస్టిక్ స్టోరి. పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా సినిమా ఉంటుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అందరికీ కనెక్టవుతూ, మనసులు కదిలించే విధంగా ఉంటుంది. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఒక కొత్త దర్శకుడికి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్ ఇస్తూ సపోర్ట్ చేసారు. సినిమా అవుట్ పుట్ పట్ల టీమ్ అందరం ఎంతో సంతృప్తితో ఉన్నాం. కేదార్ శంకర్, అజయ్ ఘోష్ ల పాత్రలు సినిమాకు హైలెట్ గా ఉంటాయి. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా“ అన్నారు.
నిర్మాత డా.లింగేశ్వర్ మాట్లాడుతూ…“నేను విడుదలయ్యే ప్రతి సినిమా చూస్తూ దాని గురించి అనాలసిస్ చేసేవాణ్ని. ఇక నేనే సినిమా చేస్తున్నప్పుడు ఎంత కేర్ తీసుకుంటానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత వరకు తెర పై రానటువంటి కథ ఇది. మా సినిమాకు, సుద్దాల అశోక్ తేజ గారు నాన్న పై రాసిన పాటకు అవార్డ్స్ వస్తాయనడంలో సందేహం లేదు. ప్రతి తల్లీదండ్రితో పాటు పిల్లలందరూ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేసే సినిమా. మధ్యలో ఎంత మంది వచ్చినా చివరి వరకు మనల్ని ప్రేమించేది మాత్రం తల్లిదండ్రులే అనే సందేశం మా సినిమా ద్వారా ఇస్తున్నాం. విలువలు, బాంధవ్యాలు చూపిస్తూనే కమర్షియల్ హంగులు జోడించాం. పెద్ద సింగర్స్ తో పాటలు పాడించాం. త్వరలో ఆడియో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
బెస్ట్ విన్ ప్రొడక్షన్స్ అధినేత భీమినేని సురేష్ మాట్లాడుతూ…“సినిమా టైటిల్, స్టోరి బావున్నాయి. అభిరుచితో డా.లింగేశ్వర్ గారు ఈ సినిమా నిర్మించారు. సినిమా నచ్చి మంచి పబ్లిసిటీ ఇస్తూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీరంగం సతీష్, కొరియోగ్రాఫర్ నరేష్ ఆనంద్, ఎడిటర్ జెపి తదితరులు పాల్గొన్నారు.
తరుణ్ తేజ్, లావణ్య, సిద్ధిక్ష, అజయ్ ఘోష్, సీనియర్ సూర్య, సుజాత, రూపిక, సత్య కృష్ణ, కేదార్ శంకర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ః శ్రీను విన్నకోట; స్టంట్స్ః రామ్ సుంకర; సంగీతంః సబు వర్గీస్; లిరిక్స్ః సుద్దాల అశోక్ తేజ, డా.లింగేశ్వర్, వనమాలి, రామాంజనేయులు; కొరియోగ్రాఫర్ః నరేష్ ఆనంద్; నిర్మాతః డా.లింగేశ్వర్; దర్శకత్వంః నవీన్ నాయని.