Surya’s ‘Bandobast’ (Kaappaan Audio Launch)
తనని తాను మలుచుకుంటూ ఈ రేంజ్‌కు ఎదిగిన హీరో సూర్య `బందోబస్త్`తో మరో గొప్ప విజయాన్ని సాధిస్తాడు – సూపర్‌స్టార్ రజనీకాంత్
ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేసే హీరోల్లో సూర్య ఒకరు. ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ‘సింగం’ వంటి పక్కా కమర్షియల్ సినిమాలు… ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ’24’ వంటి డిఫరెంట్ సినిమాలు… ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి లవ్ స్టోరీలు చేయడం ఆయనకు మాత్రమే సాటి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న తమిళ సినిమా ‘కప్పాన్’. తెలుగులో ఈ సినిమా ‘బందోబస్త్’గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. హేరీశ్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను ఆదివారం విడుదల చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా…
సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ – “శివాజీ సినిమాలో నాతో కె.వి.ఆనంద్‌గారు పనిచేశారు. ఆ సినిమా నేను శంకర్‌తో చేయడానికి కారణమైన వ్యక్తుల్లో కె.వి.ఆనంద్‌గారు ఒకరు. ఆయనకు కథపై మంచి జడ్జ్‌మెంట్ ఉంటుంది. ఆయనతో నేను ఒక సినిమా చేయాల్సింది. కానీ.. కొన్ని పరిస్థితుల్లో అది కుదరలేదు. ఇక మోహన్‌లాల్‌గారు ఈ సినిమాలో మంచి పాత్రలో నటించారు. ఆయన గొప్ప నటుడే కాదు.. గొప్ప మనసున్న వ్యక్తి. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఆర్య.. నటనను ‘నేను దేవుణ్ణి’ సినిమాలో చూసి ఆశ్చర్యపోయాను. అంత గొప్పగా నటించారు. ఇక హేరీశ్ జైరాజ్‌గారు.. మ్యూజిక్ చాలా బావుంది. ఆయన సంగీతం అందించిన సినిమాల్లో ‘చెలి’లోని మనోహరా… సాంగ్ నాకు బాగా ఇష్టమైన సాంగ్. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే సుభాస్కరన్ గురించి చెప్పాలంటే… ఆయన మనకు దేవుడిచ్చిన వరం. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో సగం మంది ఆయన సినిమాల్లోనే పనిచేస్తున్నారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో ‘ఇండియన్ 2’ సినిమాను చేస్తున్నారు. అది తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. అలాగే 60 ఏళ్లుగా ఎంజిఆర్‌గారి నుండి ఇప్పటి వరకు ఎందరో చేయాలనుకుంటున్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే నేను, మురుగదాస్‌గారు కలిసి చేస్తోన్న ‘దర్బార్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సూర్య గురించి చెప్పాలంటే ఆయన తండ్రి శివకుమార్‌గారి గురించి చెప్పాలి. తన సహనటులు ఎవరికీ చెడ్డ పేరు రాకూడదనుకునే వ్యక్తి ఆయన. ఆయన సూర్య, కార్తిని చక్కగా పెంచి పెద్దచేశారు. కార్తి తొలి సినిమా ‘పరుత్తి వీరన్’ (మల్లిగాడు)లో అద్భుతంగా నటించాడు. కానీ సూర్య నటించిన తొలి సినిమా చూసి ఇతనకు నటించడానికి రావడం లేదే అనుకున్నాను. కానీ ఆయన తనను తాను మలుచుకుని ఈ స్థాయికి వచ్చినిలబడ్డారు. `శివపుత్రుడు`, ‘సింగం’, ‘సింగం2స, `వీడొక్కడే`, ‘గజిని’ వంటి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన తప్ప మరెవరూ చేయలేరనేంత గొప్పగా నటించారు. ఆయన రీసెంట్‌గా ఎడ్యుకేషన్ సిస్టంపై చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పు పట్టారు. ఆయనకేం అర్హత ఉందని ప్రశ్నించారు. కానీ.. అగరం ఫౌండేషన్‌ను స్థాపించి ఎందరికో విద్యను అందిస్తున్న సూర్య అక్కడి పిల్లలు పడే కష్టాన్ని కళ్లారా చూసుంటాడు. అందువల్లే తను అలా స్పందించాడు. తన వ్యాఖ్యలను నేను సమర్ధిస్తున్నాను. తను ఆ విషయంపై మాట్లాడటానికి పూర్తిగా అర్హుడు.
సూర్య ఇంకా `బందోబస్త్’ వంటి సినిమాలే కాదు. ఎన్నో గొప్ప సినిమాలు చేసి ఇంకా ప్రజాభిమానం పొందాలి. తర్వాత ఆయన అవసరం తప్పకుండా ప్రజలకు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు“ అన్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ – “నా బలమేంటి? అని ఎవరైనా అడిగితే.. మరో ఆలోచన లేకుండా ఫ్యాన్స్ అనే చెబుతాను. ఈ ‘బందోబస్త్’ చిత్ర ఆడియో కోసం హేరీశ్ ఎంత కష్టపడ్డాడో తెలుసు. తనతో నేను చేస్తోన్న 9వ సినిమా. ఇక కె.వి.ఆనంద్‌గారితో నా జర్నీ ఎప్పటి నుండో కొనసాగుతుందో ప్రేక్షకులకు తెలుసు. ఆయనతో ‘అయాన్’ (వీడొక్కడే), ‘మాట్రాన్’ (బ్రదర్స్) చిత్రాలు చేశాను. ఇది మా కలయికలో వస్తోన్న మూడో సినిమా. ఆయన గొప్ప పని రాక్షసుడు. అందరినీ మెప్పించే సినిమా దీన్ని మలిచాడు. ఇందులో నేను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యుడి పాత్రలో నటించాను. ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చిందంటే ముందుగా నిర్మాత సుభాస్కరన్‌గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సినిమాలో మోహన్‌లాల్‌గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక అన్నలా ఆదరించారు. ఎన్నో కొత్త విషయాలను చెప్పారు. ఆయనతో కలిసి 25 రోజుల పాటు పనిచేశాను. ఇది నాకు ఎంతో ఇంపార్టెంట్ సినిమా. అలాగే… సినిమాలో ఆర్య, సయేషా జంట మంచి నటన కనపరిచారు. ఈ సినిమాలో ఆర్య ఉన్నప్పటికీ నేను సయేషాతో జంటగా నటించాను. కొంత బాధగా అనిపించినా సినిమా కాబట్టి తప్పలేదు. ప్రేక్షకులు నన్ను ఇంతలా ఆశీర్వదిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. మన ప్రయత్నం తప్పుకావచ్చు. కానీ.. ప్రయత్నాలు చేయడం మాత్రం మానుకోకూడదు. అందరూ అలాగే కష్టపడితే, తప్పకుండా సక్సెస్ వస్తుంది. గొప్ప గొప్పవారికే జయాపజయాలు తప్పలేదు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన రజనీకాంత్‌గారికి థ్యాంక్స్. ఆయన చెప్పినట్లు ఆయన దారి ఎప్పుడూ రహదారే. ఆయన ఒక తెరిచిన పుస్తకం. ఆయన దారిలో మరొకరు రాలేరు. రియల్ లైఫ్‌లో ఆయనొక హీరో అనే సంగతి మనకు తెలసిందే. ఇక ఇదే వేడుకకి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన శంకర్‌గారు ప్రతి సినిమాతో మన సినిమాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతున్నారు. ‘సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టిని.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ’ అని నేను బాగా నమ్ముతాను. నేను నా అభిమానులకు చెప్పేదొక్కటే ముందు మీరు, మీకుటుంబం.. తర్వాతే మన సమాజం గురించి ఆలోచించండి.. ఏదీ ప్రకటనల కోసం మాత్రం చేయవద్దు“ అన్నారు.
కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ మాట్లాడుతూ – “లైకా సుభాస్కరన్‌గారికి, డైరెక్టర్ కె.వి.ఆనంద్ గారికి, నా డార్లింగ్ సూర్యకు ముందుగా అభినందనలు. కె.వి.ఆనంద్ డైరెక్టర్‌గా కాకుండా కెమెరామెన్‌గా వర్క్ చేసేటప్పటి నుండి నా సినిమాలకు పనిచేశారు. అవార్డులను కూడా అందుకున్నారు. నటుడిగా నా 41వ సంవత్సరం జర్నీ ఇది. డేడికేషన్, నటీనటులు పెర్ఫామెన్స్, ప్యాషన్‌తో చేసిన ఈ `బందోబస్త్కా` సినిమాకు పైనున్న దేవుడు అండగా నిలుస్తాడు“ అన్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ – “చాలా మంచి టీమ్‌కుదిరింది. సూపర్‌హిట్ కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. కథ, పెర్ఫామెన్స్, యాక్షన్, విజువల్స్, మ్యూజిక్ ఇలా అన్ని అద్భుతంగా కుదిరాయి. తెరపై సూర్య, కె.వి.ఆనంద్‌గారి కష్టం కనపడుతుంది. కె.వి.ఆనంద్‌గారు నా దగ్గర పనిచేసేటప్పుడు సీన్ బాగా రావడానికి ఎంత ఆలోచిస్తారో నాకు తెలుసు. సూర్య రాను రానూ యువకుడిలా మారుతున్నారు. పర్‌ఫెక్షనిస్ట్.. డేడికేషన్ ఉన్న నటుడు. ఈ సినిమా తనకు వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ సినిమాగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. సుభాస్కరన్ వంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకు నిర్మాత కావడం ఆనందించదగ్గ విషయం. `బందోబస్త్’ వంటి మంచి చిత్రాలను మరిన్నింటిని ఆయన నిర్మించాలని కోరుకుంటున్నాను. హేరీశ్ జైరాజ్ సూపర్బ్ మ్యూజిక్ అందించాడు. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్“ అన్నారు.
సీనియర్ నటుడు శివకుమార్ మాట్లాడుతూ – “కె.వి.ఆనంద్‌గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కెరీర్ ఓ పెయింటర్‌గా స్టార్ట్ అయ్యింది. కెమెరామెన్‌గా ఎదిగారు. నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఈరోజు దర్శకుడిగా ఇక్కడ ఉన్నారు. అయితే ఈయనతో నా పరిచయం ఆయన చిన్నతనంలోనే జరిగింది. ఆయన 6వ తరగతిలో వేసిన ఓ పెయింటింగ్‌కు నా చేత అవార్డు తీసుకోవడం యాదృచ్చికంగా జరిగింది. ఇక ఆనంద్‌గారు డైరెక్టర్‌గా ఎలాంటి సినిమాలు చేశారనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూర్యతో ఆయన ‘అయాన్'(వీడొక్కడే), ‘మాట్రాన్'(బ్రదర్స్) సినిమాలను తెరకెక్కించారు. వీరిద్దరి కలయికలో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఫంక్షన్‌ను విజయవంతం చేయడానికి వచ్చిన రజనీకాంత్‌గారికి, డైరెక్టర్ శంకర్‌గారికి, ఈ సినిమాలో సూర్యతో కీలక పాత్రలో నటించిన మోహన్‌లాల్‌గారికి థాంక్స్. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు, దర్శకులకు అభినందనలు“ అన్నారు.
హీరో ఆర్య మాట్లాడుతూ – “సూర్య, కె.వి.ఆనంద్‌గారి కలయికలో వస్తోన్న మూడో చిత్రమిది. అలాగే సూర్య, హేరీశ్ జైరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న 9వ సినిమా. ముఖ్యంగా సూర్య, హేరీశ్ జైరాజ్‌గారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్. ఈ సినిమాలో సాంగ్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సినిమా గురించి చెప్పాలంటే నేను, కె.వి.ఆనంద్‌గారి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాను. అలాంటి తరుణంలో కె.వి.ఆనంద్‌గారు నాకు పిలిచి అవకాశం ఇచ్చారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఓ నటుడి నుండి ఎలాంటి నటనను రాబట్టాలో బాగా తెలిసిన దర్శకుడాయన. సయేషాతో పెళ్లి తర్వాత కలిసి చేస్తోన్న చిత్రమిది. బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్. సూర్యగారి క్రమశిక్షణ, కష్టపడే తత్వమే ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. అలాగే మోహన్‌లాల్‌గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇక నిర్మాత సుభాస్కరన్ గారి లాంటి ప్యాసనేట్ ప్రొడ్యూసర్ కారణంగానే సినిమా ఇంత బాగా వచ్చింది. `బందోబస్త్` సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది“ అన్నారు.
డైరెక్టర్ కె.వి.ఆనంద్ మాట్లాడుతూ – “వేడుకకి విచ్చేసిన రజనీకాంత్‌గారు, డైరెక్టర్ శంకర్‌గారికి థ్యాంక్స్. మోహన్‌లాల్‌గారి సినిమాలకు కెమెరామెన్‌గా కెరీర్ ప్రారంభంలో పనిచేశాను. ఆయనొక స్పాంటేనియస్ యాక్టర్. తన ముందు కెమెరా లేదు అని నటించే గొప్ప నటుల్లో ఆయనొకరు. ఈ సినిమాలో ఆయన ప్రైమ్ మినిష్టర్ రోల్‌లో నటించారు. ఈరోల్‌కు ఎవరినీ తీసుకుంటే బావుంటుందా? అని ఆలోచించే సమయంలో ఆయన టక్కున గుర్తుకొచ్చారు. ఆయన్ని వెళ్లి కలిసి కథ చెప్పగానే వెంటనే ఓకే చేశారు. రేపు సినిమా చూస్తే ఆయన తప్ప.. మరొకరు ఆ పాత్రలో చేయలేరనేంత గొప్పగా నటించారు. ఇక హీరో సూర్యగారితో నేను చేసిన మూడో సినిమా. మా మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఓ సీన్ అవుట్‌పుట్ కోసం చాలా కష్టపడతారు. ఎన్ని టేకులైనా చేస్తారు. ఎక్కడా కాంప్రమైజ్ కారు. అలాగే ఆర్య మంచి పాత్రలో నటించారు. అడగ్గానే ఏమాత్రం కాదనకుండా వెంటనే చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. సయేషా అమేజింగ్ యాక్ట్రెస్. తనకు మంచి భవిష్యత్ ఉంది. ఇక నిర్మాత సుభాస్కరన్‌గారి గురించి చెప్పాలి. ఆయన నిర్మాతగా కంటే సినిమాలపై ప్యాషన్ ఉన్న ప్రేక్షకుడు. అందుకే ఎక్కడా మేకింగ్ విషయంలో ఆలోచించరు. గొప్పగా సినిమాను చేయాలని ప్రయత్నిస్తారు. హేరీశ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే పాటలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక సినిమాటోగ్రాఫర్ ప్రభుగారికి, ఎడిటర్ ఆంటోనిగారు సహా సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్“ అన్నారు.
సీనియర్ రైటర్ వైరముత్తు మాట్లాడుతూ – “ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్‌గారికి, నేషనల్ యాక్టర్ మోహన్‌లాల్ గారికి ముందుగా కృతజ్ఞతలు. ఇలాంటి భారీ చిత్రం రావడానికి ప్రధాన కారణమైన వ్యక్తుల్లో ముఖ్యుడు నిర్మాత సుభాస్కరన్. ఆయన చొరవతోనే ఈ సినిమా రూపొందింది. సూర్య నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడో గొప్ప నటుడిగా తనను తాను రుజువు చేసుకున్నాడు. కేవలం సినిమాలే కాదు.. సమాజం గురించి బాధ్యత ఉండే కొద్ది మంది హీరోల్లో ఆయన ఒకరు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హేరీశ్ జైరాజ్ గారు నాకు మంచి మిత్రుడు. ఆయనతో కలిసి ఇది వరకే పనిచేశాను. డైరెక్టర్ కె.వి.ఆనంద్ ఒక పని పర్‌ఫెక్షన్ కోసం తాపత్రయపడే వ్యక్తి. సూర్య, కె.వి.ఆనంద్, హేరీశ్ కలయికలో వచ్చిన `బందోబస్త్` గొప్ప ఆలోచన. ఇలాంటి సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో కార్తి మాట్లాడుతూ – “నా ఫేవరేట్ యాక్టర్ మోహన్‌లాల్‌గారు. ఆయన అన్నయ్యతో కలిసి పనిచేస్తున్నారని తెలియగానే ఎంతో సంతోషమేసింది. అలాగే ఈ ఫంక్షన్‌కి వచ్చిన రజనీకాంత్‌గారు, శంకర్‌గారు వంటి గొప్ప వాళ్లని చూస్తే.. వారి ప్రయాణమెంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది. ఇక సినిమా గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ కె.వి.ఆనంద్‌గారి గురించి మాట్లాడాలి ప్రేక్షకుడు కొత్తదనాన్ని ఎలా అందివ్వాలా అని ఆలోచిస్తూనే.. సినిమాను ఎంటర్‌టైనింగ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఇంత గొప్ప సినిమాను నిర్మించిన సుభాస్కరన్ గారికి థ్యాంక్స్. నాకంటే అభిమానులే ఆన్నయ్యను ఎక్కువగా ప్రేమిస్తారు. వారందరికీ ఈ సినిమా తప్పకుండా పెద్ద ఫీస్ట్‌లా ఉంటుంది“అన్నారు.
సయేషా సైగల్ మాట్లాడుతూ – “హీరో సూర్యగారు అమేజింగ్ యాక్టర్. బ్యూటీఫుల్ పెర్ఫామర్. ప్రొఫషనలిజం ఉన్న యాక్టర్. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అలాగే మోహన్‌లాల్‌గారి వంటి సహృదయుడు, గొప్ప నటుడితో కలసి పనిచేసే అవకాశం ఈ సినిమాలో దక్కింది. ఆర్య మంచి సపోర్ట్ చేసే భర్తే కాదు.. మంచి సపోర్టింగ్ యాక్టర్ కూడా. హేరీశ్ జైరాజ్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమాలో పనిచేసిన ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కు థ్యాంక్స్“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హేరీశ్ జైరాజ్ మాట్లాడుతూ – “ఈ సినిమా పాటలకు ఇంత మంచి ఆదరణ వచ్చిందంటే కారణం.. నా టీమ్ మెంబర్స్‌తో పాటు పాటల రచయితలే. రెగ్యులర్‌గా పాడే సింగర్స్‌తో పాటు.. చిన్న పిల్లలు కూడా ఈ సినిమాలో పాటలు పాడటం విశేషం. ఇక ఈ సినిమాలో నేటి దేశ పరిస్థితులకు తగిన విధంగా ఓ మంచి పాట కావాలని అడిగినప్పుడు వైరముత్తుగారు అద్భుతంగా ఓ పాటను రాసిచ్చారు. ఆయనకు ప్రత్యేకమైన కృత్జజ్ఞతలు. సూర్యగారితోనేను చేస్తోన్న 9వ సినిమా. ఆయనతో నేను పనిచేసిన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు నటుడిగా ఆయన ఎదిగిన విధానాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. చాలా గొప్ప స్థాయికి ఎదిగారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత గొప్ప సినిమాను నిర్మించిన సుభాస్కరన్‌గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎంటైర్ టీమ్‌కు థ్యాంక్స్“ అన్నారు.
సముద్రఖని మాట్లాడుతూ – “మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ కె.వి.ఆనంద్‌గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు పనిచేయడం హ్యాపీ జర్నీలా అనిపించింది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. హీరో సూర్యకు జన్మదిన శుభాకాంక్షలు. గ్రామీణ యువత ఎదుగుదలకు మంచి చేయాలని తాపత్రయపడుతున్న సూర్య కోరిక నేరవేరాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను“ అన్నారు.