రియల్ హీరో అనిపించుకుంటోన్నః ప్రశాంత్ రెడ్డి
రియల్ హీరో అనిపించుకుంటోన్నః ప్రశాంత్ రెడ్డి
పోలీసుల వృత్తి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది… కేసులు, ఇన్వెస్టిగేషన్లు. అలానే శాంతి భద్రతలను కాపాడటం… రౌడీ మూకల పనిపట్టడం లాంటి హీరోయిజం ఎలివేట్ చేసే నిత్య కార్యక్రమాలు. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ సి.ఐ.పింగళి ప్రశాంత్ రెడ్డి వృత్తి స్టైల్ వేరు. కేవలం ఖాకీ దుస్తులతో ప్రజలను భయపెట్టడం కాదు… వారిలో పోలీసు వ్యవస్థతో ఓ మంచి ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలనే సంకల్పం ఆయనది. అందుకే ఆయన పనిచేసిన ప్రతిచోటా… వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ… ప్రజలచేత.. మరోవైపు తాను పనిచేసే డిపార్ట్ మెంట్ చేత జేజేలు కొట్టించుకుని… శెభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఆయనకు ఫాలోయింగ్ ప్రజల్లో ఎంతగా వుందంటే… మొన్న జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థిగా నిలబడతారు అనేంతగా ఆయన ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు. అంత మంచి పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ శాఖలో పనిచేస్తున్నారు.
ఆయన గతంలో కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట సీఐగా పనిచేసిన సమయంలో ప్రశాంత్ రెడ్డి అక్కడి యువతలో మంచి స్ఫూర్తిని నింపారు. దానికి తోడు అక్కడ నిత్య జనగణమన జాతీయగీతం ఆలపించే కార్యక్రమాన్ని నిర్వహించగా…. దానికి విశేష ఆదరణ లభించింది. ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో పలు చోట్ల నిత్య జనగణమన గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం మొదలు పెట్టారు. యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు సి.ఐ చేపట్టిన ఈ నిత్య జనగనమనతో ఆయన నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. కేంద్ర హోం శాఖ అధికారులతో ప్రశంసలు అందుకున్నారు. ఇలా చేయడం వల్ల సమాజంలో క్రైం రేట్ తగ్గుతుందని ఆయన భావన. అంతే కాదు మహిళల్లోనూ సేవా స్ఫూర్తి ని తీసుకురావాలని పేదల కోసం పిడికెడు బియ్యం పోగు చేయాలని సూచించగా… దానికి మంచి స్పందన లభించి… మహిళల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి మరింత పేరు తెచ్చుకున్నారు ఆయన. గతంలో ఆయన పనితీరు చూసి ప్రస్తుత తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… సి.ఐ. పింగళి ప్రశాంత్ రెడ్డికి మంచి పాలోయింగ్ ఉందని, నిత్యం ప్రజల్లో మమేకమై తలలో నాలుకలా వుంటాడని, తాను చెప్పినా ఇంత జనం రాలేరని, ఓ కార్యక్రమంలో ఈటలే స్వయంగా అన్నారు అంటే… ప్రశాంత్ రెడ్డి స్వభావం.. వృత్తి పట్ల, ముఖ్యంగా సమాజం పట్ల ఆయనకు ఎంతటి అంకిత భావం వుందో తెలుస్తోంది. ప్రస్తుతం DSP ప్రమోషన్లో వున్న ఈ పోలీస్ హీరో… భవిష్యత్తులోనూ ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి… మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేసి ప్రశంశలు పొందాలని ఆశిద్దాం.