టిఎఫ్‌సిసి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నూతన చిత్ర నిర్మాణం !!
ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ టిఎఫ్‌సిసి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నూతన చిత్ర నిర్మాణం
తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్‌సిసి) లో `అమ్మకు ప్రేమతో` చిత్రం దగ్గర నుంచి ఇప్పటి వరకు వంద చిత్రాలు టైటిల్ రిజిస్ట్రేషన్ తో పాటు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. దీనిని గుర్తించిన సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ వారు ప్రశంసిస్తూ ఇటీవల ఓ సర్టిఫికెట్ అందించారు. దీంతో పాటు టిఎఫ్‌సిసి ని గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు `టిఎఫ్‌సిసి` ట్రేడ్ మార్క్ లోగోను కూడా రిజిస్టర్ చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను అందుకున్న టిఎఫ్‌సిసి వారు ఈ ఆనందంలో `టిఎఫ్‌సిసి` పతాకంపై ఔత్సాహికులతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో `మహిళాకబడ్డి` అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ సందర్భంగా ఈ రోజు `టిఎఫ్‌సిసి`లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టిఎఫ్‌సిసి చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్, టిఎఫ్ సిసి వైస్ చైర్మన్ ఏ.గురురాజ్, జనరల్ సెక్రటరీ కాచెం సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..“ఈ రోజు నిజంగా చాలా సంతోషమైన రోజు. మా టిఎఫ్‌సిసిలో వంద చిత్రాలు సెన్సార్ పూర్తవడం… సెంట్రల్ సెన్సార్ బోర్డ్ వారు గుర్తించి మాకు ప్రశంసా పత్రం పంపించడం… అలాగే మా టిఎఫ్‌సిసి కి ట్రేడ్ మార్క్ లోగో లభించడం ఇవన్నీ మాకు ఎంతో సంతోషాన్నిచ్చాయి. ఈ ఆనందంలో టిఎఫ్‌సిసి లో మహిళలతో స్పోర్ట్స్ నేపథ్యంలో `మహిళాకబడ్డి` చిత్రాన్ని ప్రారంభించాం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. మంగ్లీ, మధుప్రియ , గీతామాధురి, శ్రావణభార్గవి లాంటి పేరున్న సింగర్స్ పాడారు. ఇందులో దాదాపు ఒరిజినల్ కబడ్డీ ప్లేయర్స్ నటిస్తారు. ఇటీవల ఆల్ ఇండియా కబడ్డీ కోచ్ ని మా సినిమా కోసం సంప్రదించి కొన్ని సలహాలు తీసుకున్నాం. ఇందులో కొత్తవారికి అవకాశం ఇస్తున్నాం. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఇక మా ఫిలించాంబర్ తరపున లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి సాయమందించాం. ఇవన్నీ చేయగలుగుతున్నామంటే మా చాంబర్ మెంబర్స్ సహకారం వల్లే. ఇక మా చాంబర్ కొత్త బ్రాంచ్ ని ఇటీవల యాదాద్రిలో ప్రారంభించాం. త్వరలో మరికొన్ని చోట్ల ప్రారంభించనున్నాం. అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే కొత్త బ్రాంచ్ లు ఏర్పాటు చేస్తున్నాం. మా చాంబర్ లో టైటిల్ కానీ, సెన్సార్ కానీ నెలలు కొద్దీ తిప్పించకుండా ఒకటి రెండు రోజుల్లోనే అయ్యేలా చేస్తాం. మా చాంబర్ లో ఇప్పటికే చాలా మంది నిర్మాతలు చేరారు. 24 క్రాఫ్ట్స్ వారు ఇటీవల చాలా మంది చేరుతున్నారు. చాంబర్ నిర్మించడానికి , చాంబర్ లో సభ్యులకు ఇళ్ల స్థలాల కోసం ఐదు ఎకరాల భూమిని ఇవ్వమని ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాము..వారు సానుకూలంగా స్పందించారు“ అన్నారు.
టిఎఫ్‌సిసి వైస్ చైర్మన్, నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ…“ మా చాంబర్ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకున్నారు. కానీ ఈ రోజు వంద చిత్రాలు సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు గుర్తించి మమ్మల్ని ప్రశంసించడం , మా చాంబర్ కి ట్రేడ్ మార్క్ లోగో లభించడంతో వారందరికీ ఇదొక మంచి సమాధానం అని చెప్పవచ్చు. నిజంగా ఇదంతా జరిగిందంటే మా చైర్మన్ ప్రతాని రామకృష్ణ గారు అంకితభావంతో పనిచేయడమే. తెలుగు రాష్ట్రాల్లతో పాటు వేరే రాష్ట్రాల నిర్మాతలు కూడా మా చాంబర్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు“ అన్నారు.
టిఎఫ్‌సిసి జనరల్ సెక్రటరి కాచెం సత్యనారాయణ మాట్లాడుతూ…“ప్రతాని గారి కృషితో పాటు చాంబర్ సభ్యుల సహకారం వల్లే ఈ రోజుకి వంద చిత్రాల సెన్సార్ పూర్తి చేయగలిగాం. భవిష్యత్ లో ఇంకా ఎన్నో విజయాలు మా చాంబర్ తరఫున సాధిస్తాం“ అన్నారు.