Maharshi pre release Event
`మహర్షి` నాకు చాలా ఇంపార్టెంట్ సినిమా-మహేష్
సూపర్ స్టార్ మహేష్ హీరోగా వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , పి.వి.పి సినిమా బేనర్స్ పై హై టెక్నికల్ వేల్యూస్ తో రూపొందుతోన్న చిత్రం `మహర్షి`. మహేష్ కు ఇది 25 వ చిత్రం కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మే 9న విడుదలవుతోన్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ…“రాజకుమారుడు చిత్రంతో మహేష్ బాబును హీరోగా పరిచయం చేసాం. తన 25వ చిత్రం నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ…“నాలో కామెడీ యాంగిల్ నే కాదు..సీరియస్ యాంగిల్ ను కూడా చూసి ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు“ అన్నారు.
చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ…“మహేష్ గారిని డైరక్ట్ చేయడం చాలా హ్యాపీ. గతంలో నేను ఎక్కడున్నా….ఇప్పుడు ఎక్కడున్నా అనేదే జర్నీ. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నా. దేవిశ్రీ గారు సినిమాకు పెద్ద ఎస్సెట్. శ్రీమణి గారు అద్భుతమైన లిరిక్స్ రాసారు. మే 9న జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చూసి సినిమా పిచ్చి పట్టింది…అదే మే 9న నేను డైరక్ట్ చేసిన మహర్షి ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేష్ తన పాత్రకు ప్రాణం పోసారు. మే 9న మహేష్ గారి ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకుని తిరిగే రోజని చెబుతున్నాను“ అన్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ…“ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. మహేష్ గారి సినిమాలకు పని చేయడం ఎప్పుడూ హ్యాపీనే. ఎందుకంటే ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ రెస్పాన్స్ బులిటీ కూడా ఉంటుంది. కథ వినగానే కన్నీళ్లు పెట్టుకున్నా. మహేష్ గారు ఆయనతో పని చేసే ప్రతి ఒక్కరికీ ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా అంతా ఒక ఎత్తైతే ..క్లైమాక్స్ మరో ఎత్తు. క్లైమాక్స్ చూసిన వాళ్లు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండరు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యాను. సినిమా చూసాక ప్రేక్షకులు కూడా ఎమోషనల్ ఫీలవుతారు“ అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…“సూపర్ స్టార్ అభిమానుల కోరిక మే 9న తీరబోతుంది. మహేష్ గారి 25వ చిత్రాన్ని మూడు బేనర్ లు కలిసి చేసాం. దేవిశ్రీ ఈ సినిమా కోసం మూడేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాడు. పాటలు పెద్ద హిట్టయ్యాయి. విజువల్స్ ను ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసి అందరూ కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు“ అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…“నేను ఇంటర్మీడియట్ నుండి మహేష్ బాబుగారికి పెద్ద ఫ్యాన్ ని. అందుకే ఆయన్ని సార్ అని పిలవడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. మేము కాలేజ్ లో ఉన్నప్పుడు మావాడు అని అనుకునేవాళ్లం. ఆయన 25 వ సినిమా. ఇదొక జర్నీ. జర్నీ ఆఫ్ రిషి. కోణార్క్ లో మహేష్ బాబు సినిమాలు చూడాలనుకునే వాడిని.కానీ, మాస్ ఫ్యాన్స్ కారణంగా టికెట్స్ దొరికేవి కావు. చివరకు లేడీస్ క్యూ తక్కువగా ఉంటుందని తెలుసుకుని సినిమా రిలీజ్ సమయంలో నా కజిన్స్ ద్వారా టికెట్స్ తీసుకునేవాడిని. అలా యాక్టర్ అయిన తర్వాత ఓ అవార్డ్ ఫంక్షన్ కు వెళ్లాను. అక్కడకు మహేష్ గారు రాగానే ఆయన్ను అందరూ విష్ చేయడం చూసి అరె! లైఫ్ అంటే అలా ఉండాల్రా అనుకున్నాను. నేను చేసిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలపై మహేష్ గారు ట్వీట్ చేసారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వారు ట్వీట్ చేసేలా మంచి సినిమాలు చేస్తాను. నా పుట్టిన రోజు మహర్షి సినిమా విడుదలవుతుంది. పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మే 9 కోసం ఒక ఫ్యాన్ గా, యాక్టర్ గా ఎదురు చూస్తున్నా“ అన్నారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ…“మహేష్ ప్రపంచాన్నే ఏలేస్తాడమ్మా!! ట్రైలర్ చూసారుగా..అదిరిపోయింది. మహే ష్ కిది 25వ సినిమా అయినా ఆయన వయసు మాత్రం 25లాగే కనిపిస్తోంది. ప్రతి యాక్టర్ కు ఒక ఫేవరేట్ కెమేరా యాంగిల్ ఉంటుంది. తనకి మాత్రం 360 డిగ్రీస్… ఏ కోణంలో చూపించినా అందంగానే కనపడతాడు. ఒకప్పుడు చిన్నోడు నా పై కోపంతో పూలకుండీని తన్నాడు. అలా తన్నినప్పుడు ఆ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో తెలుసు. మళ్లీ ఈ సినిమాతో అన్నీ రికార్డ్ లు తన్నేయాలని కోరుకుంటున్నా. మే 9న ఒక మంచి సినిమా చూడబోతున్నామన్నా ఆశాభావంతో ఉన్నా“ అన్నారు.
సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ…“ మా అన్నయ్య వెంకటేష్ గారికి థ్యాంక్స్. ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్ గా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆయన్ను ఇష్టపడ్డంతగా ఎవరినీ ఇష్టపడను. ఆయన ఏ ఫంక్షన్ కు వెళ్లినా అది సూపర్ హిట్ అంటారు. ఇక యంగ్ జనరేషన్ హీరోల్లో విజయ్ ను ఎక్కువగా అడ్మైర్ చేస్తాను. అర్జున్ రెడ్డి సినిమాలో తన నటన నాకు బాగా నచ్చింది. ఈ ఇరవై ఐదు సినిమాల జర్నీలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన దర్శకులు చాలా మందే ఉన్నారు. ముందుగా రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్. ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేసారు. అలాగే మురారి సినిమా ఇచ్చిన కృష్ణ వంశీ, ఒక్కడు చేసిన గుణ శేఖర్ అలాగే నన్ను అతడు చిత్రంతో యుఎస్ ఆడియన్స్ కు పరిచయం చేసిన త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్. ఇక నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అంటే దూకుడు సినిమానే. అంత మంచి సినిమా ఇచ్చిన శ్రీనువైట్ల గారికి థ్యాంక్స్. ఇక శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో రెండు సార్లు లైఫ్ ఇచ్చిన కొరటాల శివ గారికి థ్యాంక్స్. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక మహర్షి చేస్తోన్న వంశీ నా తమ్ముడు లాంటి వాడు. వంశీ ఇచ్చిన 20 నిమిషాల నేరేషన్ ఇచ్చాక సినిమా చేయాలని ఫిక్సయ్యా. కానీ , రెండు సినిమాల తర్వాతే ఈ సినిమా చేయగలననీ చెప్పా. అయిన వెయిట్ చేస్తానన్నారు. అలాగే నాకోసం వెయిట్ చేసాడు. సినిమాలో నరేష్ ఇంపార్టెంట్ రోల్ చేసారు. ఇక దేవిశ్రీ నా సినిమాకు ఆర్ ఆర్ చేస్తున్నాడంటే నేను రిలాక్స్ అయిపోతాను. మా ముగ్గురు నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చేసారు. నాకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఈ 25 సినిమాల జర్నీలో ప్రేక్షకులు, అభిమానులు చూపించిన అభిమానానికి చేతెలెత్తి దండం పెడుతున్నా.ఈ అభిమానం, ప్రేమ మరో పాతిక సినిమాలు, 20 ఏళ్లు ఉండాలని ఆశిస్తున్నా“ అన్నారు.