Bandobast Review
సినిమా రివ్యూ: బందోబస్త్
రేటింగ్: 2.75/5
నటీనటులు: సూర్య, సాయేషా సైగల్, మోహన్ లాల్, ఆర్య తదితరులు
తెలుగు పాటలు: చంద్రబోస్, వనమాలి
తెలుగు మాటలు: శ్రీ రామకృష్ణ
సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. ప్రభు
సంగీతం: హ్యారీస్ జైరాజ్
నిర్మాత: ‘లైకా ప్రొడక్షన్స్’ సుభాస్కరన్
తెలుగు రాష్ట్రాల్లో విడుదల: ఎన్వీ ప్రసాద్
దర్శకత్వం: కె.వి. ఆనంద్
విడుదల తేదీ: 20 సెప్టెంబర్ 2019
నటుడిగా తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి పేరుంది. కానీ, ఈ మధ్య సరైన విజయాలే లేవు. ఈ రోజు విడుదలవుతున్న ‘బందోబస్త్’తో విజయం అందుకుంటారా? ‘రంగం’తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కె.వి. ఆనంద్ ఈ సినిమాను ఎలా తీశారు? ప్రచార చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సూర్య, కె.వి. ఆనంద్… సినిమాతోనూ ఆకట్టుకున్నారా? మోహన్ లాల్, ఆర్య, సాయేషా సైగల్ ఎలా చేశారు?
కథ: రవి (సూర్య) సీక్రెట్ ఇంటిలిజెన్స్ అధికారి. ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్)పై తీవ్రవాదులు లండన్ లో చేసిన హత్యాయత్నాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటాడు. అంతకు ముందే ప్రధానిపై ఓసారి హత్యాయత్నం జరుగుతుంది. రవి ప్రతిభను గుర్తించిన ప్రధాని అతణ్ణి వ్యక్తిగత సెక్యూరిటీ ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్)లోకి తీసుకుంటారు. అయితే… కశ్మీర్ లో జరిగిన ఎటాక్ లో ప్రధానిని రవి కాపాడలేకపోతాడు. చంద్రకాంత్ వర్మ మరణం తర్వాత అతడి కుమారుడు అభిషేక్ వర్మ ప్రధాని అవుతాడు. అతడికి రవి ఎటువంటి సహాయం అందించాడు? అభిషేక్ వర్మకు వ్యాపారవేత్త మహేంద్ర (బొమన్ ఇరానీ)కి ఎందుకు గొడవలు వచ్చాయి? గోదావరి డెల్టాలో మైనింగ్ తవ్వకాలకు, మహేంద్రకు సంబంధం ఏంటి? అసలు, ప్రధానిపై హత్యాయత్నం చేయించింది ఎవరు? అంజలి ఎవరు? ఇటువంటి పలు ప్రశ్నలకు సమాధానమే ‘బందోబస్త్’.
ప్లస్ పాయింట్స్:
సూర్య నటన
కథ, స్క్రీన్ ప్లే
సమకాలీన సమస్యల ప్రస్తావన
మైనస్ పాయింట్స్:
కథకు అడ్డు తగిలిన పాటలు
కథనంలో వేగం తగ్గింది
కామెడీ వర్కవుట్ కాలేదు
లాజిక్కులు మిస్ అయ్యారు
నటీనటులు:
సూర్యకు ఇటువంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. ప్రధాని వ్యక్తిగత సెక్యూరిటీగా, పాత్రలో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. హెయిర్ స్టయిల్, ఫిజిక్ బాగా సూట్ అయింది. సినిమా ప్రారంభంలో కాసేపు రైతుగాజుట్టు కాస్త ఎక్కువ పెంచుకుని వేరియేషన్ చూపించారు. ఇంటెన్స్ సీన్స్ నటుడిగా మెప్పించారు. మోహన్ లాల్ కు పెద్దగా నటించే అవకాశం రాలేదు. పాత్ర పరిధి మేరకు చేశారు. ప్రధాని కుమారుడిగా, తండ్రి మరణం తరవాత ప్రధాని పదవి చేపట్టిన యువకుడిగా ఆర్య చక్కగా నటించారు. సాయేషా సైగల్ అందంగా కనిపించింది. అవకాశం వచ్చిన చోట నటించింది. తీవ్రవాది రంజిత్ పాత్ర పోషించిన వ్యక్తి బాగా నటించాడు. బొమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ తదితరులవి రొటీన్ పాత్రలే.
విశ్లేషణ:
ప్రధాని సెక్యూరిటీ విషయంలో ఎస్.పి.జి కమాండోలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారనేది కాస్తలో కాస్త వివరంగా చూపించిన చిత్రమిది. ప్రధాని రక్షణ కోసం ప్రాణత్యాగాలకు వెనుకాడని వీర జవాన్ల కృషికి గౌరవం ఇచ్చిన చిత్రమిది. ప్రధానిపై హత్యాయత్నాలు జరిగే సమయంలో సెక్యూరిటీ ఎలా స్పందిస్తుంది? అనేది చూపించారు. అంతవరకు బావుంది. కానీ, కథలో కొన్ని లాజిక్కులు మిస్ అయ్యారు. ఓ మంత్రి కుమార్తె ప్రధాని మీడియా విభాగంలో ఎందుకు పని చేస్తుంది? అంత త్వరగా ప్రధాని సెక్యూరిటీలో పని చేస్తున్న కమాండోతో ప్రేమలో ఎలా పడింది? వంటి లాజిక్కులు మిస్ అయ్యారు. అంతే కాదు… సినిమా చూస్తుంటే ప్రధాని ఆఫీసులో వివరాలు తీవ్రవాదులకు అంత సులభంగా క్షణాల వ్యవధిలో ఎలా చేరతాయి అనేది అంతుబట్టదు. అవి ఎలా చేరాయనే విషయంలో దర్శకుడు ఇచ్చిన వివరణ కన్వీన్సింగ్ గా లేదు. కానీ, స్క్రీన్ ప్లే రాసిన విధానం బావుంది. ప్రేక్షకుల్లో నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆసక్తి కొంతవరకూ కలిగించారు. ప్రధానిపై వరుస హత్యాయత్నాలతో పాటు సమాంతరంగా రైతు సమస్యలను ప్రస్తావించారు. అయితే… కథనంలో వేగం తగ్గడంతో కొన్ని సన్నివేశాలు బోర్ కొడతాయి. కార్పొరేట్ కుతంత్రాలను క్షుణ్ణంగా చెప్పలేకపోయారు. మధ్యలో మధ్యలోవచ్చే పాటలు కథకు అడ్డు తగిలాయి. తీవ్రవాదులు ఏం చేస్తారోననే ఉత్కంఠ కలిగించే సమయంలో పాటలు పంటికింద రాయిలా తగిలాయి. కామెడీ సన్నివేశాలు కూడా వర్కవుట్ కాలేదు. అవి తీసేసి ఈజీగా ఒక అరగంట కత్తిరిస్తే సినిమా రేసీగా ఉంటుంది. ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
ఫైనల్ గా …
ఇటీవల వచ్చిన సూర్య సినిమాల్లో మంచి చిత్రమిది. కథ, స్క్రీన్ ప్లే బావున్నాయి. మంచి యాక్షన్ థ్రిల్లర్ కి కావలసిన అంశాలు కథలో ఉన్నాయి. అటు ప్రధాని భద్రతా వ్యవహారాలు, ఇటు రైతు సమస్యలు… రెండిటికీ కార్పొరేట్ కుతంత్రాలతో ముడి వేయడంతో సినిమాను రేసీగా తీయడంలో దర్శకుడు కె.వి. ఆనంద్ తడబడ్డాడు. నిడివి కూడా ఎక్కువైంది. మధ్యలో కమర్షియల్ విలువల కోసం పెట్టిన పాటలు, కామెడీ క్లిక్ కాలేదు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళితే సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.