`ఏప్రిల్ 28 ఏం జరిగింది` ప్రీ రిలీజ్ వేడుక !!
ఏప్రిల్ 28 ఏం జరిగింది చిత్రం ఊహకందని మలుపులతో థ్రిల్‌ను పంచుతుంది: ప్రీ రిలీజ్ వేడుకలో హీరో నిఖిల్, బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సొహెల్
రంజిత్ , షెర్రీ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ఏప్రిల్ 28 ఏం జరిగింది. వీజీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వీరాస్వామి.జి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, బిగ్‌బాస్-4 ఫేమ్ సయ్యద్ సొహెల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ పెద్ద సినిమా, చిన్న సినిమా అనే మాటల్ని నేను చాలా ఏళ్లుగా వింటున్నా. ఆ భేదాలకు అర్థం ఏమిటో నాకు తెలియదు. సినిమా బడ్జెట్ ఎంత, అందులో ఎవరూ నటించారనేది దానికంటే సినిమా అందించే ఎక్స్పీరియన్స్ ముఖ్యం అని నా భావన. అనుభూతి పరంగా చూస్తే ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా నేను ఈ సినిమా చూశా. చాలా నచ్చింది. హీరో రంజిత్ నాకు మంచి స్నేహితుడు. యువత, అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ సమయంలో ఆ సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి నేను పడిన బాధ, తపన అవన్నీ రంజిత్‌లో ఈ సినిమా ద్వారా చూస్తున్నా. రంజిత్ కోసం ఈ సినిమా ఆడాలి. మంచి పాయింట్‌ను ఎంచుకొని ఈ సినిమా చేశారు. ఆద్యంతం ఊహకందని మలుపులతో థ్రిల్‌ను పంచుతుంది. విరామ సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. ద్వితీయార్థం, పతాక ఘట్టాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావించి ఈ సినిమాను ప్రోత్సహించడానికి ముందుకొచ్చా. సౌండ్ డిజైనింగ్, ఎడిటింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్‌కు మించి సినిమా అద్భుతంగా ఉంటుంది అని అన్నారు.
బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సొహెల్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను చూసిన మొదటి సినిమా ఇది. నాకు చాలా బాగా నచ్చింది. అశ్లీలత, ద్వంద్వర్థాలకు తావు లేకుండా కుటుంబమంతా కలిసిచూసేలా ఉంటుంది. రంజిత్ అద్భుతమైన నటనను కనబరిచాడు. వీరాస్వామి వినూత్నమైన పాయింట్‌తో సినిమాను తెరకెక్కించారు. హరిప్రసాద్ స్క్రీన్‌ప్లే ఉత్కంఠను పంచుతుంది. బోర్ లేకుండా ఆద్యంతం ఈ సినిమా థ్రిల్‌ను కలిగిస్తుంది అని తెలిపారు.
హీరో రంజిత్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 28న అడవిరాముడు, యమలీల, బాహుబలి, పోకిరి లాంటి గొప్ప సినిమాలు విడుదలయ్యయని హాస్యనటుడు అలీ ఓ సందర్భంలో చెప్పారు. అలాంటి మంచి రోజును టైటిల్‌గా తీసుకొని రూపొందిన చిత్రమిది. ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడి సినిమా చేశాం. మంచి ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆదరిస్తారనే నమ్మకముంది అని పేర్కొన్నారు.
చిత్ర దర్శకుడు వీరాస్వామి మాట్లాడుతూ.. తొలుత మార్చి 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాం. కానీ ఆ రోజు ఎక్కువ సినిమాలు విడుదలవుతుండటంతో ఫిబ్రవరి 27న విడుదలచేస్తున్నాం. డ్యాన్స్ అసిస్టెంట్, డ్యాన్స్‌మాస్టర్, రచయిత, దర్శకుడిగా ఇలా నా ప్రతి అడుగులో కుటుంబ సభ్యుల సహకారం ఉంది. కుటుంబ ప్రోత్సాహంతో పాటు రంజిత్‌కు నాపై ఉన్న నమ్మకం వల్లే ఈ సినిమా చేయగలిగా. ధర్మతేజ సాహిత్యం, సందీప్ సంగీతం, భాను నృత్యాలు, రంజిత్, రాజీవ్ కనకాల, అజయ్ అభినయం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయి. నిఖిల్, సొహెల్ సినిమా చూసి ప్రశంసించడంతో పాటు ప్రేక్షకుల్లోకి ఈ చిత్రాన్ని తీసుకెళ్లడానికి సహాయం చేస్తుండటం ఆనందంగా ఉంది అన్నారు.
స్క్రీన్‌ప్లే రైటర్ హరిప్రసాద్ జక్కా మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఓ ఇంటి నేపథ్యంలో విభిన్నంగా సాగుతుంది. డాక్టర్‌గా పేరుతెచ్చుకున్న రంజిత్ ఈ సినిమాతో యాక్టర్‌గా చక్కటి గుర్తింపును తెచ్చుకుంటాడనే నమ్మకముంది అని తెలిపారు.
గేయరచయిత ధర్మతేజ మాట్లాడుతూ.. సినిమా కథను అంతర్లీనంగా చాటిచెప్పే మంచి పాటను రాశాను. చక్కటి టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుంది అని అన్నారు.
సంగీత దర్శకుడు సందీప్ కుమార్ మాట్లాడుతూ కథానుగుణంగా పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరాయి అని తెలిపారు.
డ్యాన్స్ మాస్టర్ భాను మాట్లాడుతూ.. దర్శకుడు అవ్వాలనే వీరాస్వామి కల ఈ సినిమాతో నెరవేరింది. నృత్య దర్శకుడిగానే కాకుండా దర్శకుడిగా ప్రభుదేవా, లారెన్స్ మాదిరిగా వీరాస్వామి గొప్ప పేరు తెచ్చుకోవాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎడిటర్ సంతోష్, కో-డైరెక్టర్ బాలాజీ, రంజిత్ గురువు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.