Jersey Appreciation meet
నిజాయతీతో జెన్యూన్‌గా కథ చెప్పినప్పుడు మ్యాజిక్ క్రియేట్ అవుతుందదని `జెర్సీ`తో ప్రూవ్ అయ్యింది – నేచురల్ స్టార్ నాని
నాని కథానాయకుడిగా నటించిన సినిమా `జెర్సీ`. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలైంది. ఈ సినిమా నచ్చి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం అప్రిషియేషన్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా…
దిల్ రాజు మాట్లాడుతూ “నేను ఈ సినిమా డబుల్ పాజిటివ్‌ని నానితో పాటు చూశా. చూడగానే మా నానికి, వంశీకి `చాలా మంచి సినిమా చేశారు. ప్రేక్షకులు ఏ రేంజ్‌కి తీసుకెళ్తారనేది తెలియాలి` అని అన్నా. అన్నట్టుగానే రిలీజ్ రోజు నాకు చాలా బాగా నచ్చింది. అదే రోజు మధ్యాహ్నం చినబాబుగారు, వంశీ వాళ్ల ఆఫీస్‌కి వెళ్లి `ఐ వాంట్ టు అప్రిషియేట్ ద హోల్ టీమ్` అని చెప్పా. లాస్ట్ ఇయర్ `మహానటి` సినిమాను చూసినప్పుడు ప్రసాద్ ఐ మ్యాక్స్ నుంచి బొకే తీసుకుని నేరుగా నేను అశ్వనీదత్‌గారి ఆఫీస్‌కి వెళ్లా. ఈ సినిమాను చూసినప్పుడు కూడా వీళ్ల ఆఫీస్‌కి వెళ్లి చెప్పాలనిపించింది. చాలా సినిమాలు వస్తాయి. కొన్ని సినిమాలు చాలా బావుంటాయి. జనరల్ ఆడియన్స్ కూడా చాలా బావుందని మెచ్చుకుంటున్నారు. ప్రేక్షకులు, ఇండస్ట్రీ, మీడియా ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. వాళ్లందరినీ చూసి చాలా హ్యాపీగా ఉన్నా. ఈవెంట్‌ని నేను చేయడానికి మెయిన్ రీజన్ ముగ్గురు. దర్శకుడు, నాని, నిర్మాత. ఒకే ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ తో ఇలాంటి సినిమాను డీల్ చేయడం చాలా గ్రేట్ జాబ్. జీవితంలో సక్సెస్‌లు, ఫెయిల్యూర్లు వస్తాయి. ఇలాంటివి కొన్ని జీవితాంతం గుర్తుండిపోతాయి. `మళ్లీరావా`ను చాలా బాగా హ్యాండిల్ చేశాడు గౌతమ్. ఈ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు. గౌతమ్ అమేజింగ్ పర్సన్. నాని నేచురల్ స్టార్. ఆయన పెర్ఫార్మెన్స్ గురించి అందరూ చెబుతున్నారు. నాని అద్భుతమైన నటుడే. అతను ఏ సినిమా చేసినా నాని గొప్పగా కనిపిస్తాడు. ఆడే సినిమాలో నాని ఉన్నప్పుడు ఇంకా అద్భుతంగా కనిపిస్తాడు. ఈ సినిమా గురించి ఒకసారి చినబాబుగారు `ఇలాంటి సినిమా చేస్తున్నాం. నాకు రెమ్యూనరేషన్ వద్దు సార్. ప్రాఫిట్ వస్తే ఇవ్వండి` అని నాని అన్నారని అప్పుడు ఆయన నాతో అన్నారు. నాని ఇవాళ గట్టిగా అడిగితే డబ్బు ఇవ్వడానికి ఏ నిర్మాత అయినా రెడీగా ఉంటారు. ప్రాజెక్ట్ సెట్ చేస్తే కాదని ఏ నిర్మాత అనగలరు? అయినా మంచి సినిమా చేసినందుకు నానికి థాంక్స్. నిర్మాత వంశీ చాలా కంగారుగా ఉండేవాడు. `మంచి సినిమా తీశారు వంశీ` అని ఆయనకు ఇప్పటికి నాలుగు సార్లు చెప్పాను. కమర్షియల్ సినిమాలు చాలా వస్తాయి. `మంచి సినిమా, కమర్షియల్ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది` అని అన్నారు. హీరోయిన్ అంత బాగా చేయడానికి డైరక్టర్ కారణం కావచ్చు. హీరోయిన్, నాని, చిన్న పిల్లాడు, సత్యరాజ్‌గారు చాలా బాగా చేశారు. డీటైల్డ్ గా దర్శకుడు చేశాడు. అల్టిమేట్ సక్సెస్‌కి కారణం దర్శకుడు. ఏ సినిమాకైనా సక్సెస్ వచ్చిందంటే కారణం ఇది టీమ్ వర్క్ అని. ఈ సినిమాను చూడని ప్రతి ఒక్కరూ చూడండి“ అని అన్నారు.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ “ఏప్రిల్ 19న విడుదలైంది. అంతకు ముందు ప్రీ రిలీజ్ రోజు కూడా చెన్నైలో లాస్ట్ రీల్ మిక్సింగ్ జరుగుతూ ఉంది. అందుకే నేను ప్రీ రిలీజ్ కి రాలేకపోయాను. కానీ కారులో వెళ్తూ ప్రీ రిలీజ్ వేడుకను చూశాను. నానిగారు మాట్లాడుతున్నప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ బాగానే అనిపించింది కానీ, ఇంత ఎక్స్ పెక్టేషన్ పెట్టుకున్నారా అని టెన్షన్ వచ్చింది. సినిమా విడుదలైన రోజు సాయంత్రానికి ఆ టెన్షన్ తీరింది. అప్రిషియేషన్ మీట్‌ను ఏర్పాటు చేసినందుకు దిల్‌రాజుగారికి థాంక్స్. అందరూ చాలా మంచి రివ్యూలు ఇచ్చారు. ఈ అప్రిషియేషన్ వల్ల మరో సినిమాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు వంశీగారికి, పీడీవీ ప్రసాద్‌గారికి ధన్యవాదాలు. టీమ్‌లో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు“ అని చెప్పారు.
కె.కె. మాట్లాడుతూ “ఫ్లైట్‌లో గౌతమ్‌గారు ఫస్టాఫ్ చెప్పారు. అక్కడి నుంచి క్యాబ్‌లో వెళ్తున్నప్పుడు సెకండాఫ్ చెప్పారు. ఇదే ఎమోషన్ సినిమాలో క్యారీ అయితే చాలా పెద్ద సినిమా అవుతుందనిపించింది. మంచి సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. టీమ్ అందరికీ ధన్యవాదాలు“ అని చెప్పారు.
ప్రవీణ్ మాట్లాడుతూ “దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చేస్తున్నప్పుడు చాలా సార్లు కంటతడి పెట్టుకున్నాను. జర్సీని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు“ అని చెప్పారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ “నేను చేసింది రెండు సీన్లు. అందులో ఓ మంచి సీను డైరక్టర్‌గారు తీసేశారు. ఒక్క మంచి సీన్ మాత్రం ఉంచారు. అదృష్టంగా భావిస్తున్నా. సక్సెస్‌ఫుల్‌గా ఉన్న హీరోలు ఇలాంటి రిస్కులు చేస్తారు. కానీ నాని గత సినిమా పోయినా చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేశారు. పాత్ బ్రేకింగ్ అనేది లైఫ్ రిస్కు చేస్తేనే వస్తుంది. తను ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. చేయడానికి ముందు తను ఏం ఫీలై చేశాడనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ టీమ్ అంతా చాలా బాగా చేశారు. గౌతమ్‌లాంటి వాళ్లు కరెప్ట్ కాకుండా, ఇలాంటి సినిమాలు చేయాలి. వేసవిలో వచ్చిన సినిమాలన్నీ సెన్సిబుల్ సినిమాలే. నాకు మొనాటినస్ పెరిగినప్పుడు నాని దగ్గరకు వెళ్లి యాక్ట్ చేస్తే డీటాక్స్ అయినట్టు అనిపిస్తుంది“ అని చెప్పారు.
శ్రద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ “ఆడియన్స్ కి థాంక్స్ చెబుతున్నాను. టీమ్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది నాకు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు మా సినిమాను ఆదరిస్తున్న తీరు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే తీరు చాలా బావుంది“ అని అన్నారు.
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “నాకు ఈ కథ విన్నప్పుడే అద్భుతంగా అనిపించింది. సినిమాలో అర్జున్‌కి బీసీసీఐ ఈవెంట్ ప్లాన్ చేసినట్టు, దిల్‌రాజుగారు అప్రిషియేషన్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఆయనకు మంచి సినిమా నచ్చినప్పుడు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. సినిమా ఉదయం ఆట చూసి దిల్‌రాజుగారు ఫోన్ చేశారంటేనే సినిమా హిట్ అయినట్టు. ఈ సినిమాకు కూడా ఉదయం ఇంటి గేటు నుంచి అడుగు బయటపెడుతుంటే దిల్‌రాజుగారు ఫోన్ చేశారు. నాకు క్లారిటీ వచ్చింది. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరికీ థాంక్స్ చెప్పా. గౌతమ్ కథలో ఎంత నిజాయతీ ఉందో.. ఆయనతో కూడా అంతే హానెస్టీ ఉంటుంది. మనసులోనుంచి వచ్చిన జెన్యూన్ కథ అయినప్పుడు తప్పకుండా మేజిక్ క్రియేట్ అవుతుందని నమ్ముతాను. గౌతమ్ స్వతహాగా చాలా హానెస్ట్ గా ఉన్నాడు. బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా అలాగే ఉన్నాడు. `గౌతమ్ చాలా పెద్ద డైరక్టర్ అవుతాడు` అని నమ్మా. ఫస్ట్ నుంచి చెప్పా. గౌతమ్ నాలో అర్జున్‌ని చూసినందుకు థాంక్స్. మా నిర్మాతలు చినబాబుగారు, వంశీ, పీడీవీ ప్రసాద్‌గారు చాలా బాగా చేశారు. పీడీవీ ప్రసాద్‌గారిని ఇప్పుడే కలిశాను. ఇలాంటి సినిమాను యాక్టర్, డైరక్టర్ నమ్మి ముందుకు వెళ్లొచ్చు. కానీ నిర్మాతలు బిజినెస్ యాంగిల్లో చూస్తారు కాబట్టి, వాళ్లు మేం నమ్మినంత నమ్మాల్సిన అవసరం లేదు. అయినా వంశీ చాలా బాగా నమ్మాడు. ప్రతి విషయంలోనూ కంగారు పడి చేశాడు. సాను సినిమాటోగ్రఫీతో కథ చెప్పాడు. సినిమా నుంచి సెపరేట్‌గా కెమెరా కనిపించాలని అనుకోలేదు. అనిరుద్ సంగీతంతో కథ చెప్పారు. ఆ సంగీతాన్ని చాలా బాగా కెకె అర్థం చేసుకున్నారు. ఆర్ట్ డైరక్టర్స్ అప్పుడున్న టైమ్ ఫ్రేమ్నిబాగా చూపించారు. సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కథ చెప్పారు. అందరికీ ధన్యవాదాలు. నటీనటులు చాలా బాగా చేశారు. సత్యరాజ్‌గారితో పనిచేయడం చాలా హ్యాపీ. గంట కోసం పిలిచినా సరే, చెన్నై నుంచి వచ్చేశారు. నాకు లైఫ్ లాంగ్ సత్యరాజ్గారంటే మనసులో మూర్తిగారే. మా శ్రద్ధా ఎప్పుడు షూటింగ్ చేసినా తను అడుగుతూ ఉండేది. అర్జున్ మీద చిరాకు పడినప్పుడల్లా `నేను బ్యాడ్ అనుకుంటారేమో` అని కంగారు పడేది. ఆ కేరక్టర్ చాలా ఎడ్జ్ మీద ఉన్న కేరక్టర్. తనని పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంది. తను చాలా బాగా చేసింది. రోణిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వాడిని షాట్లో చూస్తుంటే ముద్దొచ్చేవాడు. నాన్‌స్టాప్‌గా మాట్లాడేవాడు. కానీ ఇవాళ ఎందుకో మాట్లాడలేదు. వాడు ఫ్యూచర్లోనూ మంచి సినిమాలు చేయాలి. ప్రవీణ్‌తో ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు చేశా. ఈ సినిమా స్పెషల్‌గా గుర్తుండిపోతుంది. బ్రహ్మాజీగారితో అందమైన సీన్ షూట్ చేశాం. ఆ సీన్ సినిమాలో లేదు. ఇప్పుడు ఆయన లక్కీ ఛార్మ్. ఈ సినిమా తర్వాత ఒక్క సీన్ అయినా వచ్చి చేస్తారని అనుకుంటున్నాం. ఈ మూవీకి నీరజ కాస్ట్యూమ్స్ చేసింది. క్రికెట్ కి చాలా కాస్ట్యూమ్స్ కలెక్ట్ చేసింది. క్రికెట్ కన్విన్సింగ్‌గా ఆడానంటే అందుకు కారణం డేనియల్. ఆయనకిథాంక్స్ చెప్పాలి. అందరిలోనూ బోలెడంత ప్రేమ ఉంది. దాన్ని వాళ్లు మాకు ఇవ్వాలంటే మేం మంచి రీజన్ ఇవ్వాలి. ఈ సారి ఆ రీజన్ జెర్సీ అయింది. మామూలుగా నేను ప్రతి సినిమా చేసిన తర్వాత `ఐదేళ్ల తర్వాత నా సినిమా చూస్తే పాతబడిపోద్దా.. ఎంత పాతబడిపోద్ది` అని అనుకునేవాడిని. కానీ ఈ సినిమా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా. స్టేజ్ మీద ఉన్న అందరూ పాతబడిపోవచ్చు కానీ జెర్సీ ఎప్పటికీ పాతబడిపోదు“ అని అన్నారు.