Agent Sai Srinivasa Athreya Review : 2.75/5

Agent Sai Srinivasa Athreya Review : 2.75/5
 
 

సినిమా రివ్యూ: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
రేటింగ్: 2.75/5

నటీనటులు: నవీన్ పోలిశెట్టి, శ్రుతి శర్మ తదితరులు
పాటలు: కృష్ణకాంత్ 
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
సంగీతం: మార్క్ కె. రాబిన్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
కథ, మాటలు, దర్శకత్వం: స్వరూప్ ఆర్.ఎస్.జె
విడుదల తేదీ: 21 జూన్  2019

తెలుగులో డిటెక్టివ్ కథలతో ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలేవీ రాలేదు. మొన్నామధ్య తమిళంలో విశాల్ హీరోగా నటించిన ‘డిటెక్టివ్’ తెలుగులోనూ విడుదలైంది. ఈ వారం మరో సినిమా వచ్చింది. అదే నవీన్ పోలిశెట్టి హీరోగా పరిచయమవుతున్న ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ప్రచార చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన క్లాసిక్ ఫిలిం ‘చంటబ్బాయ్’ను గుర్తు చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి, సినిమా ఎలా ఉంది?

కథ: 
నెల్లూరులో ‘చంటబ్బాయ్’ లాంటి ఒక ఏజెంట్. అతని పేరు సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్ పోలిశెట్టి). అతనికో లేడీ అసిస్టెంట్. ఆమె పేరు స్నేహ (శృతి శర్మ). ఇద్దరికీ పెద్దగా కేసులేవీ రావు. సరైన కేసు ఒక్కటి దొరికితే బావుంటుంది అనుకుంటున్న తరుణంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని శవం పడి ఉందని క్రైమ్ రిపోర్టర్ ఆయన స్నేహితుడు ఫోన్ చేసి చెప్తాడు. సాయి శ్రీనివాస ఆత్రేయ ఒక్కడే అక్కడికి వెళ్తాడు. పోలీసులు వచ్చేసరికి శవం పక్కన ఆత్రేయ మాత్రమే ఉండటంతో అతనిపై అనుమానంతో అరెస్ట్ చేస్తారు. ఆ కేసు ఎన్ని మలుపులు తిరిగింది? చివరకు, ఎక్కడ ఆగింది? రైల్వే ట్రాక్ పక్కన పడి ఉంటున్న గుర్తు తెలియని శవాల వెనుక కుట్ర ఏమైనా దాగుందా? అనేది మిగతా సినిమా.

ప్లస్ పాయింట్స్:
కథ, కథలో మలుపులు
నవీన్ పోలిశెట్టి నటన 
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్
సినిమాటిక్ లిబర్టీ

విశ్లేషణ:
ఇదొక డీసెంట్ థ్రిల్లర్. ఒక అంశానికి మరొక అంశానికి ముడిపెడుతూ కొత్త దర్శకుడు చక్కటి కథ రాసుకున్నాడు. కానీ, అంతే చక్కగా తెరకెక్కించడంలో కాస్త తడబడ్డాడు. చాలా నెమ్మదిగా కథను చెప్పాడు. సన్నివేశాలను సాగదీశాడు. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా ముందుకు సాగుతుంది‌. నేరేషన్ మరీ స్లోగా ఉంది. దానికి తోడు సరైన కామెడీ సన్నివేశాలు పడలేదు. సెకండాఫ్ వచ్చేసరికి కథలో వేగం పుంజుకుంటుంది. ఒక మలుపు తర్వాత మరొక మలుపు వస్తూ తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగిస్తుంది. అయితే.‌.. సెకండాఫ్ లోనూ కొన్ని సన్నివేశాల్లో స్లో నేరేషన్ చికాకు పెడుతుంది. సినిమాను క్రిస్పీగా తీసి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే పర్వాలేదు. కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ చేసిన సినిమా చూడబోయే ప్రేక్షకులకు థ్రిల్ ఉండదు. అందుకని, చెప్పడం లేదు. కథల్లో నుంచి బయటకు వెళ్లకుండా ప్రేక్షకులు నవ్వించే ప్రయత్నం చేసినందుకు మెచ్చుకోవాలి. కొన్ని పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. థ్రిల్లర్ సినిమాలో కావాల్సిన లాజిక్కులను విస్మరించే సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ముందుకు వెళ్లడం కథ లోతుల్లోకి వెళ్లి ఆలోచించే ప్రేక్షకులకు నచ్చదు‌. అనవసరంగా పాటలను ఇరికించనందుకు అభినందించాలి. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ కూడా.

నటీనటుల పనితీరు:
డిటెక్టివ్ గా నవీన్ పోలిశెట్టి ఆహార్యం బాగుంది. తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, హిందీలో యూట్యూబ్ సిరీస్ లు చేసిన అనుభవంతో డిటెక్టివ్ పాత్రలో ఒదిగిపోయాడు. ‘చంటబ్బాయ్’లో చిరంజీవితో పోల్చలేము కానీ… నవీన్ కామెడీ టైమింగ్ పర్వాలేదు. బుక్స్ అమ్మడానికి ప్రయత్నించే సన్నివేశంలో నవ్విస్తాడు. రెగ్యులర్ హీరోయిన్ టైప్ క్యారెక్టర్ కాకుండా శృతి శర్మకు తొలి సినిమాలో మంచి పాత్ర దొరికింది. సినిమా అంతా హీరోతో పాటు కనిపిస్తుంది. పాత్రకు తగ్గట్టు శృతి శర్మ నటించింది. సెకండాఫ్ లో సుహాస్ కాసేపు నవ్వించాడు. చిన్న సినిమా కావడం వల్ల మిగతా పాత్రలకు చోటా మోటా నటీనటులను తీసుకున్నారు. పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన వారు కావడంతో వాళ్లందరినీ ప్రేక్షకులు గుర్తు పడతారు. కానీ, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకునేంతలా ఎవరు నటించలేదు.

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
కొత్త హీరో, కొత్త దర్శకుడు కలసి చేసిన మంచి ప్రయత్నమిది. ప్రచార చిత్రాలలో చూపించినట్లు సినిమాలో కామెడీ ఎక్కువ లేదు. తర్వాత ఏం జరుగుతుంది అని ప్రేక్షకులు ఆలోచించేలా కట్టిపడేసే కథనం, కథలో మలుపులు ఉన్నాయి. ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలను, సినిమాలో చిన్నచిన్న తప్పులను క్షమిస్తే… మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాను చూడొచ్చు.