కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి నిజాలు తెలుసుకోండి – దర్శక నిర్మాతలు !!
కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి నిజాలు తెలుసుకోండి – దర్శక నిర్మాతలు !!
దేశానికి తలమానికం అయిన కశ్మీర్లో హిందూ పండితుల పై టెర్రరిస్టుల దాడి ఎందుకు జరిగింది? వారిని ఊచకోత ఎందుకు కోశారు? ఆ తర్వాత వారు ఎక్కడికు వెళ్ళారు? అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటి? అనే విషయాలను నిక్కచ్చిగా తమ కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో చెప్పామని చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి తెలియజేశారు.
దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ తదితరులు నటించిన కశ్మీర్ ఫైల్స్ హిందీ సినిమా మార్చి 11న విడుదల కాబోతోంది. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించారు. బుధవారంనాడు చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ వచ్చింది.
ఈ సందర్భంగా…
చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ, ఈ కథను నేను రాయలేదు. టెర్రరిజం ద్వారానే తెలుసుకుని సినిమా తీశాను. 1990 దశకంలో హిందూ పండితులను టార్గెట్ చేసి కొంతమంది టెర్రరిస్టులు ఊచకోతకోశారు. వారి పిల్లలను చంపేశారు. పెద్దలను పారిపొమ్మని భయపెట్టి, మహిళలను ఇక్కడే బందీలు పెట్టుకుని నరకయాతన చూపించారు. ఈ విషయాలేవీ ప్రపంచానికి తెలీయనీయకుండా కొందరు దాచేశారు. వాటికి వెలికితీయడంలో ప్రభుత్వం, మీడియా కూడా తప్పుదోవ పట్టించింది. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను. నాలుగేళ్ళపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను. సినిమా చూసి నిజాలు తెలుసుకోండని అన్నారు.
అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, కశ్మీర్ ఇండియాలో భాగం. 30 ఏళ్ళగా ఇలాంటి కథను ఎవ్వరూ తీయలేదు. వాస్తవం ఏమిటి అనేది ఈ సినిమా ద్వారా చూపించామని. ఇందులో భాగమైనందుకు ఆనందంగా వుందని తెలిపారు.
నిర్మాత పల్లవి జోషి మాట్లాడుతూ, ఈ సినిమా తీయడానికి నాలుగేళ్ళు పట్టింది. ఓ ఆపరేషన్ చేసినట్లుగా వుంది. ఈ చిత్రానికి పనిచేసిన అందరి కృషి ఇందులో వుంది. ఇంతమందితో సినిమా తీసినందుకు లక్కీగా ఫీలవుతున్నా. మేం సినిమా మొదలు పెట్టినప్పుడు సమస్యలు వస్తాయనుకోలేదు. కశ్మీర్ నుంచి ఢిల్లీవరకు రీసెర్చ్ చేసి తీసిన సినిమా ఇది. ఇదేదో 200 ఏళ్ళ నాటి కథ కాదు. ముప్పై ఏళ్ళ భారత్ కథ. కశ్మీర్లో జరిగిన విషయాలను రాజకీయనాయకులు, మీడియా కూడా నిజాన్ని నొక్కేసింది. ఈ సినిమా చేశాక వివేక్ ను ట్విట్టర్ పై ఎటాక్ చేశారు. ఇస్లాం దేశాలు ఈ సినిమాను బేన్ చేశాయి. యు.ఎస్.ఎ.లోని కశ్మీర్ పండితులు ఈ సినిమా గురించి మాట్లాడుతూ, మా హృదయాల్ని టచ్ చేశారని చెప్పారు. తేజ్ నారాయణ్, అభిషేక్ మాపై నమ్మకంతో ముందుకు వచ్చి విడుదలకు సహకరిస్తున్నారని తెలిపారు.
నటుడు దర్శన్ కుమార్ మాట్లాడుతూ, హార్ట్ అండ్ సోల్‌గా చేసిన సినిమా ఇది. ఇందులో మేం నటించలేదు. జీవించాం. కంటెండ్ ఓరియెంటెడ్ చిత్రాలు ఇష్టపడేవారికి తప్పకుండా నచ్చుతుంది. ఇందులో థ్రిల్లర్ కూడా వుంది. ఇందులో ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని నమ్మకంగా చెప్పగలను. మార్చి 11న చూసి నిజాన్ని తెలుసుకోండని అన్నారు.
బిజెపి నాయకుడు రామచంద్రరావు మాట్లాడుతూ, నేను అభిషేక్ కుటుంబ లాయర్‌గా వచ్చాను. ఇటువంటి సినిమాను అందించినందుకు వారిని అభినందిస్తున్నా. కశ్మీర్‌పై సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఎన్నో కష్టాలు చిత్ర యూనిట్ అనుభవించింది. 1980 నుంచి 1990 వరకు కశ్మీర్లో జరిగిన మానవ సంహారం. హిందువులైన కశ్మీర్ పండితులను ఊచకోత కోసిన విధానం నివ్వెరపరుస్తుంది. పిల్లలను చంపి, ఆడవారిని మాత్రమే ఇక్కడ వుండమనీ పెద్దవాళ్ళను గెంటేసిన పరిస్థితులు హృదయ విదారకంగా వుంటాయి. మన దేశంలో ఎందరో శరణార్దుల గురించి బాధపడుతున్నాం. కానీ కశ్మీర్ పండితుల గురించి ఆలోచించేవారే లేరు. కశ్మీర్ అనేది భారత్‌లో భాగమని తెలుసుకోవాలని అన్నారు.
పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, సినిమాల్లో జ్ఞానోదయం కల్గించే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అందులో అగ్రభాగంలో ఈ సినిమా వుంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే సినిమాలు రావాలి. వీటిని అడ్డుకునేవారు, విమర్శించేవారు భారత్‌ను వదిలి పాకిస్తాన్ వెళ్ళిపోండని ఘాటుగా స్పందించారు.