Hippi Movie Review 2.25/5
మూవీ రివ్యూః హిప్పీ
రేటింగ్: 2.25/5
నటీనటులు: కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జెడి చక్రవర్తి, జజ్బా సింగ్, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు
నిర్మాణ సంస్థ: వి క్రియేషన్స్
పాటలు: అనంత శ్రీరామ్, శ్రీమణి
ఛాయాగ్రహణం: ఆర్.డి. రాజశేఖర్
సంగీతం: నివాస్ కె. ప్రసన్న
నిర్మాత: కలైపులి ఎస్. థాను
రచన, దర్శకత్వం: టి.ఎన్. కృష్ణ
విడుదల తేదీ: జూన్ 6, 2019
‘ఆర్ఎక్స్ 100’ విజయానికి కథలో భావోద్వేగాలు కారణమా? శృంగారపరమైన సన్నివేశాలు కారణమా? అనే చర్చ అప్పుడప్పుడూ వినిపిస్తుంటుంది. ‘శృంగారపరమైన సన్నివేశాల వల్ల సినిమాలు ఆడవు. కథాబలం, అందులో భావోద్వేగాల వల్లే విజయాలు సాధిస్తాయి’ అని జెడి చక్రవర్తితో పాటు పలువురు సినీ ప్రముఖులు చెప్పే మాట. ఏది ఏమైనా ‘ఆర్ఎక్స్ 100’తో కార్తికేయ విజయం అందుకున్నాడు. అది విడుదలై ఏడాది తిరగక ముందే ‘హిప్పీ’తో థియేటర్లలోకి వచ్చాడు. ‘ఆర్ఎక్స్100’ను తలపించేలా ముద్దులు, కథానాయికల అందాలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంది? ఓసారి రివ్యూ చదవండి.
స్టోరి విషయానికొస్తే…
‘హిప్పీ’ దేవదాస్ (కార్తికేయ) కిక్ బాక్సర్. సన్నిహితులంతా ‘దేవా’ అని పిలుస్తుంటారు. బీటెక్ పూర్తయిన తరవాత స్నేహ (జజ్బా సింగ్) ప్రపోజ్ చేస్తే… యాక్సెప్ట్ చేసి కంపెనీ ఇస్తాడు. ఒకరోజు స్నేహతో గోవా వెళుతున్నప్పుడు ఆముక్త మాల్యదా (దిగంగన సూర్యవంశీ) పరిచయం అవుతుంది. అమ్మాయిలు ఇద్దరూ స్నేహితులు. స్నేహాకు లిప్ కిస్సు పెడుతూ… ఆముక్త మాల్యదాను చూసి ప్రేమలో పడతాడు. స్నేహాతో తిరుగుతూనే… ఆముక్త మాల్యాదాను ఫ్లర్ట్ చేస్తుంటాడు. ప్రపోజ్ చేస్తాడు. స్నేహాకు విషయం తెలిసి ‘హిప్పీ’తో గొడవ పడుతుంది. తరవాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆముక్త మాల్యదాతో ఆమెను హిప్పీ ఎంతగా ప్రేమిస్తున్నాడో చెబుతుంది. అప్పుడు హిప్పీ ప్రేమను ఆముక్త మాల్యద అంగీకరిస్తుంది. అప్పటినుంచి హిప్పీ తన హ్యాపీనెస్ కోల్పోయినట్టు భావిస్తాడు. ఆముక్త మాల్యదాను వదిలించుకోవాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆముక్త మాల్యదా ఏం చేసింది? ప్రేమలో హిప్పీ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అతడికి ఆఫీసులో బాస్ అరవింద్ (జెడి చక్రవర్తి) ఎటువంటి సలహాలు ఇచ్చాడు? అనేది థియేటర్లలో చూడాల్సిందే.
పాజిటివ్ పాయింట్స్
హీరో కార్తికేయ
హీరోయిన్ దిగంగన , అందం- అభినయం
బోల్డ్ సీన్స్, వెన్నెల కిషోర్ కామెడీ
నెగిటివ్ పాయింట్స్
రెగ్యులర్ స్టోరి, స్క్రీన్ ప్లే
లెంగ్త్
చాలా వరకు చూసిన సన్నివేశాలు
విశ్లేషణలోకి వెళితే..
అఖిల్ హీరోగా నటించిన ‘మిస్టర్ మజ్ను’ చూశారా? ప్రేమలో ఉన్నంతసేపూ టార్చర్లా ఉందని, ఊపిరి ఆడని భావన కలుగుతుందని హీరో అంటుంటాడు. ‘హిప్పీ’లో హీరో కూడా అంతే! ప్రేమలో హీరోయిన్ టార్చర్ భరించలేకపోతున్నాని అంటాడు. కాకపోతే… రెండిటి మధ్య చిన్న తేడా ఉంది. ‘మిస్టర్ మజ్ను’లో హీరోయినే హీరో వెంట పడుతుంది. రిలేషన్‌షిప్‌కి ఒప్పిస్తుంది. ‘హిప్పీ’లో హీరోయే హీరోయిన్ వెంట పడతాడు. తీరా హీరోయిన్ లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆమె ప్రేమను టార్చర్లా ఫీలవుతాడు. పవన్ కల్యాణ్ ‘తీన్మార్’ చూశారా? ఆ కథకు, ఈ ‘హిప్పీ’ కథకు మధ్య కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి. మోడ్రన్ హీరో క్యారెక్టరైజేషన్ కూడా! హీరోయిన్ మరొకరితో పెళ్లికి సిద్ధమైన తర్వాత హీరో మనసులో ప్రేమ బయటకొస్తుంది. చెప్పుకుంటూ వెళితే మరికొన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి.
ఇంతకు ముందు వచ్చిన సినిమాలకు, ‘హిప్పీ’కి తేడా ఏంటంటే… బోల్డ్ అప్రోచ్. కథను నడిపించిన విధానం, సన్నివేశాలు చిత్రీకరించిన తీరు వేర్వేరు. ప్రచారం కోసం హీరో షర్టు విప్పినట్టు… ‘హిప్పీ’లో ప్రతి పాత్ర సంప్రదాయం అనే ముసుగు తీసి మాట్లాడుతుంది. హీరో చాలాసార్లు షర్టు విప్పాడు. హీరోయిన్లు బట్టల విషయంలో పొదుపు పాటించారు. మూతి ముద్దులు, శృంగారపరమైన సన్నివేశాల్లో శృతిమించిన భావన కలుగుతుంది. ఫస్ట్ సీన్‌తో డబుల్ మీనింగ్ డైలాగుల ప్రవాహం మొదలైంది. యువతను అవి ఆకట్టుకోవచ్చు. ప్రస్తుత యువతరం ఆలోచనలను కథలో మేళవించారు. బోల్డ్ సీన్స్ కొన్ని తప్పిస్తే… చాలా సన్నివేశాలు సుదీర్ఘంగా సాగాయి. ఎంతసేపటికీ కథ మొదలైన చోట ఉన్నట్టుతుంది. అయితే మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కాస్త రిలీఫ్ ఇస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. నివాస్ కె. ప్రసన్న పాటల్లో ‘ఎవతివే’ మరికొన్ని రోజులు వినిపిస్తుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు.
నటీనటుల హావభావాలుః
కార్తికేయకు తన నటనలో వివిధ కోణాలను చూపించే పాత్ర దక్కింది. అతడి నటన కంటే రొమాంటిక్, బోల్డ్ సీన్స్ ప్రేక్షకులకు ఎక్కువ గుర్తుంటాయి. హుషారైన నటనతో ఆకట్టుకున్నాడు. స్టయిలింగ్‌లో హిందీ హీరో రణ్వీర్ సింగ్‌ని ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నాడు. గోవా ఎపిసోడ్లో రంగు రంగుల దుస్తులు వేసుకున్నాడు. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ పలు సన్నివేశాల్లో హీరో కార్తికేయను డామినేట్ చేసింది. అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. బాలనటిగా సినిమాలు, సీరియల్స్ చేసిన అనుభవంతో ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. గ్లామర్ ప్లస్ యాక్టింగ్ ఆమెకు అడ్వాంటేజ్. జజ్బా సింగ్ పాత్రకు తగ్గట్టు నటించింది. జెడి చక్రవర్తి ఇమేజ్‌కు తగ్గట్టు ఆయన పోషించిన పాత్ర లేదు. మోడ్రన్ ఫిలాసఫీ గురులా జెడి డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతుంటే విని ఆనందించడం కష్టమే. ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ పాత్రలు, వారు నటించిన సన్నివేశాలు తేలిపోయాయి. శ్రద్ధా దాస్ ప్రత్యేక గీతంలో సందడి చేసింది.
సూటిగా చెప్పాలంటే..
పోస్టర్లు, ట్రైలర్లు చూసి బోల్డ్ సీన్స్ కోసం సినిమాకు వెళ్లిన, వెళ్లాలనుకున్న ప్రేక్షకులను సినిమా డిజప్పాయింట్ చేయదు. కథ, వినోదం, కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేయాలనుకున్న వారికి నిరాశే ఎదురవుతుంది. హీరో సిక్స్ ప్యాక్, రొమాన్స్ సినిమాను ఎంతవరకూ గట్టెక్కిస్తాయో చూడాలి. సినిమాకు బోల్డ్ సన్నివేశాలే ప్లస్సూ, మైనస్సూ. ఓ వర్గానికి సినిమాను దగ్గర చేస్తే.. మరో వర్గం ప్రేక్షకులను సినిమాను దూరం చేశాయి