హ్యాపీ బర్త్ డే మెగా పవర్ స్టార్!!
హ్యాపీ బర్త్ డే మెగా పవర్ స్టార్!!
చిరు తనయుడుగా `చిరుత` చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన రామ్ చరణ్ మొదటి చిత్రంతోనే తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత చిత్రంలో తన డాన్స్ , పర్ ఫార్మెన్స్, ఫైట్స్ చిరుత వేగాన్ని మించాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి ఆ సంవత్సరానికి గానూ ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులు చెర్రీకి లభించాయి. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు. మెగా పవర్ స్టార్ అయ్యాడు. ఆపై 2010లో “బొమ్మరిల్లు” భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్ (సినిమా) చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి ఎవడు (సినిమా) చిత్రంలో నటించాడు. తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ (సినిమా) చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే నటించాడు. ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు చెర్రీ. ఆ తర్వాత వచ్చిన బ్రూస్ లీ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు.
తమిళ చిత్రానికి రీమేక్ గా వచ్చిన `ధృవ` చిత్రం చరణ్ కెరీర్ ను మరింత దృడపరిచింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన `రంగస్థలం` బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచి నటుడుగా చరణ్ సత్తా ఏంటో నిరూపించింది. చెవిటి వాడిగా నాచురల్ పర్ఫార్మెన్స్ తో చరణ్ చెలరేగిపోయాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన `వినయ విధేయ రామ` చిత్రం చరణ్ కు తీవ్రమైన నిరాశను మిగల్చింది. ఇక లేటెస్ట్ గా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి `ఆర్ ఆర్ ఆర్` లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడుగా చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే తన చరణ్ గెటప్ అదిరిపోయింటున్నారు పబ్లిక్.
సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రామిసింగ్ హీరోగా దూసుకెళ్తున్నాడు. డెడికేషన్ తో , సిన్సియర్ ఎఫర్ట్ పెడుతూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తోన్న మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ పేజెస్ డాట్ కామ్.