`లక్ష్మీస్ ఎన్టీఆర్` రివ్యూ!!
`లక్ష్మీస్ ఎన్టీఆర్` రివ్యూ!!
నటీనటులు: విజయ్ కుమార్, యజ్ఞశెట్టి, శ్రీ తేజ్ తదితరులు
సమర్పణ: ఎ జివిఆర్జీవీ ఫిల్మ్స్
పాటలు: సిరాశ్రీ
రచన: రామ్ గోపాల్ వర్మ, నరేంద్ర చారి
సినిమాటోగ్రఫీ: రమ్మీ
సంగీతం: కల్యాణీ మాలిక్
నిర్మాతలు: రాకేష్ రెడ్డి, దీప్తీ బాలగిరి
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు
విడుదల తేదీ: మార్చి 29, 2018
రామ్ గోపాల్ వర్మకు, ముఖ్యంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాపై సాధారణ ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కొన్ని రోజులుగా సినిమాపై ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో సినిమా విడుదలపై గురువారం ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడంతో అసలు సినిమా విడుదలవుతుందా? లేదా? అనే చర్చలు మొదలయ్యాయి. చివరకు, ఏపీలో తప్ప మిగతా ప్రాంతాల్లో సినిమా విడుదలైంది. మరి, సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.
కథ:
ఎన్టీఆర్ (విజయ్ కుమార్) 1989లో అధికారం కోల్పోయిన తరుణమది. ఇంట్లో ఒక్కరే ఒంటరిగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అప్పుడు లక్ష్మీపార్వతి (యజ్ఞ శెట్టి) అనే మహిళ ‘మీ బయోగ్రఫీ రాసే అవకాశం ఇవ్వండి’ అని ఎన్టీఆర్ దగ్గరకు వస్తుంది. ఆమె బాగా చదువుకున్నదని తెలిసి ఎన్టీఆర్ అవకాశం ఇస్తారు. ఆ విధంగా ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన లక్ష్మీపార్వతి గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటుంటారు. ‘ఏంటిది స్వామీ?’ అని ఎన్టీఆర్‌ని లక్ష్మీపార్వతి నిలదీస్తుంది. అల్లుడు పీవీ బాబు (శ్రీ తేజ్) ప్రజల మాటలను ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళతారు. పరిస్థితులు గమనించిన ఎన్టీఆర్, ‘మేజర్ చంద్రకాంత్’ వంద రోజుల వేడుకలో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటిస్తారు. స్వగృహంలో పెళ్లి చేసుకుంటారు. తరవాత ఇద్దరూ కలిసే పార్టీ మీటింగులకు వెళతారు. ప్రచారం చేస్తారు. 1994 ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపడతారు. తరవాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం దిగడానికి, ఆయన అల్లుడు పీవీ బాబు అధికార పీఠం ఎక్కడానికి గల కారణాలు ఏంటి? వైశ్రాయ్ హోటల్ ఘటనకు ముందు, తరవాత ఏం జరిగింది? అనేది మిగతా సినిమా.
ప్లస్ పాయింట్స్:
చంద్రబాబుగా శ్రీతేజ్
ఎన్టీఆర్‌గా విజయ్‌కుమార్
లక్ష్మీపార్వతిగా యఙ్ఞశెట్టి
కథ, దర్శకత్వం
ఎమోషనల్ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
కథనంలో, సన్నివేశాల్లో సాగదీత
ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబెర్స్ సెలక్షన్
నిర్మాణ విలువలు
విశ్లేషణ:
సినిమా చూసిన తర్వాత… ఎన్టీఆర్ జీవితంలో జరిగినది జరిగినట్టుగా చూపించారని కొందరు, ఎన్టీఆర్ జీవితంలో వాస్తవాలను వక్రీకరించారని ఓ రాజకీయ నేత అభిమానులు, మరికొందరు అంటున్నారు. ఓ థియేటర్లో పార్కింగ్ దగ్గర పరిస్థితి ఇది. సినిమాలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి పేర్లు మినహా కొందరు ప్రముఖుల పేర్లు కొత్తగా వినిపిస్తాయి. పీవీ బాబు (చంద్రబాబు), రావ్ (ఓ పత్రికాధినేత)… ఇలా అన్నమాట. కానీ, తెరపై చూపించేది ఎన్టీఆర్ జీవితమని అర్థమవుతూ ఉంటుంది. చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను విలన్లుగా చూపించారు వర్మ, అగస్త్య మంజు. లక్ష్మీ పార్వతి అమాయకురాలు అని క్లీన్ చీట్ ఇచ్చారు.
ఇవన్నీ పక్కనపెట్టి ఓ సినిమాగా చూస్తే… ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, చంద్రబాబు పాత్రలకు సరైన నటీనటులను ఎంపిక చేసుకోవడం ద్వారా వర్మ సగం విజయం సాధించారు. విజయ్ కుమార్, యఙ్ఞశెట్టి, శ్రీ తేజ్… ముగ్గురూ అద్భుతంగా నటించారు. మేనరిజమ్స్ తో సహా యాక్టింగ్ ఇరగదీశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సెలక్షన్ మాత్రం బాగోలేదు. బాలకృష్ణ, హరికృష్ణ తదితరుల పాత్రలకు బిగ్రేడ్ నటీనటులను తీసుకున్నారు. కథగా చూస్తే… ఫస్టాఫ్ లో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య ప్రేమ, అనుబంధాన్ని చూపించారు. ఈ లవ్ ట్రాక్ సాగదీసినట్టు ఉంటుంది. సెకండాఫ్ లో రాజకీయాలు రావడంతో కథలో కాస్త వేగం పెరుగుతుంది. దర్శకత్వంలో వర్మ మార్క్ ఎక్కువ కనిపించింది. ఇటీవల వర్మ తీసిన సినిమాలతో పోలిస్తే ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వందరెట్లు బెటర్. అయినా… చాలా చోట్ల సినిమాను వర్మ చుట్టేశారు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉంటే బావుండేది. కల్యాణీ మాలిక్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ సోసోగా ఉన్నాయి. వీటన్నిటినీ మరచిపోయేలా పతాక సన్నివేశాలను ఎమోషనల్ గా తీసి, హై నోట్‌లో ముగించి వర్మ విన్నింగ్ షాట్ తో సినిమా తెర దించారు.
సూటిగా చెప్పాలంటే…
ఒక్కటి మాత్రం నిజం… ఈ సినిమా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను విలన్లుగా చూపించింది. కులాలు, వర్గాలు, పార్టీల పరంగా వేరు పడిన తెలుగు ప్రజల్లో కొందరికి ఈ విషయం చేదు గుళికలా, మరికొందరికి అమృతంగా అనిపిస్తుంది. కొందరు, మరికొందరు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! ఎవరు అవునన్నా… కాదన్నా… ప్రజలు రాజకీయ కోణంలో చూస్తున్న చిత్రమిది. రాజకీయాలు పక్కన పెట్టి… సినిమాగా చూస్తే, ఒకసారి చూడొచ్చు. మరో దర్శకుడు అగస్త్య మంజుతో కలిసి అక్కడక్కడా వర్మ మెరుపులు మెరిపించారు.