నా మనసులో ఎప్పుడూ చిరంజీవి డాడీ ఉంటారు -నిహారిక
నా మనసులో ఎప్పుడూ చిరంజీవి డాడీ ఉంటారు -నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల , రాహుల్ విజయ్ జంటగా నటించిన చిత్రం `సూర్యకాంతం`. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 29 న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఓవర్సీస్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకున్న నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రానికి వరుణ్ తేజ్ సమర్పకులు. ఈ సినిమా గురించి నిహారిక తన ఎక్స్ పీరియన్స్ ని పంచుకుంది. ఆ విశేషాలు..
మా నాన్నగారే సూర్యకాంతం అన్నారు…
నేను నాన్న కలిసి `కూచి` అని వెబ్ సిరీస్ చేసాం. అందులో `మా అమ్మాయి సావిత్రి టైపు` అనే డైలాగ్ మా నాన్నకు రాసారు. కానీ, మా అమ్మాయి `సూర్యకాంతం` అని అన్నారు. ఆ సమయంలో మా దర్శకుడు విన్నాడేమో ఈ సినిమాకు సూర్యకాంతం అని టైటిల్ పెట్టాడు. సినిమాకు చాలా యాప్ట్.
మా అమ్మమ్మ సూర్యకాంతం..
ఇందులో సూర్యకాంతం మా అమ్మమ్మగా కనిపిస్తారు. నా పేరు కూడా సూర్యకాంతమే. ఇష్టమైన వాళ్లతో పక్షపాతంగా ఉంటూ మిగిలిన వాళ్లను మాత్రం సాధిస్తూ ఉంటాను. ముక్కు సూటిగా ఉంటుంది. సూర్యకాంతంలా చెయ్యి తిప్పాలని అక్కడక్కడా ట్రై చేశాను.
నేను ఆ టైపు కదా..
నా సినిమా ఆడిందనో, ఆడలేదనో బాధ పడే రకం కాదు నేను. నా పని నేను పర్ఫెక్ట్ గా చేసానా లేదా? అన్నదే ముఖ్యం. నేను ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తాను. నా గత సినిమాలు ఆడకపోయినా, నాకు మాత్రం పాజిటివ్ గానే రివ్యూస్ వచ్చాయి. నా మనసులో ఎప్పుడూ చిరంజీవి డాడీ ఉంటారు. డూపులు లేకుండా ఆయన ఫైట్లు చేసి ఇంటికి వచ్చినప్పుడు సురేఖా మమ్మీ పడ్డ బాధేంటో నాకు తెలుసు. ఆయనవి కూడా కొన్ని సినిమాలు ఆడలేదు. సినిమా ఆడటానికి పోవడానికి సరైన రిలీజ్ , ఇంకా ఇలాంటి కారణాలు ఉంటాయి.
ఫ్యూచర్ లో నిర్మిస్తాను…
మా నాన్నగారు, అరవింద్ మామ సినిమాలు నిర్మిస్తుంటే చూస్తూ పెరిగాను. కాబట్టి అవన్నీ నాకు నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి. ఏదీ గాలికి వదిలేయను. ప్రతిది దగ్గరుండి చూసుకుంటాను. మంచి ప్లానింగ్ ఉంటుంది. డిజిటల్ లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో మేకింగ్ జరుగుతోంది. సినిమాలు తీయాలని లేదు, తీయొద్దని లేదు..చూద్దాం ఎలా ఉంటుందో.
ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర…
సైరాలో నా పాత్రకు డైలాగులు ఉండవు. రెండు సన్నివేశాల్లో కనిపిస్తాను. కానీ తప్పకుండా నోటీస్ చేసే సినిమా అవుతుంది అని చెప్పగలను.
ముఫ్పై లోపు చేసుకుంటా..
30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం నా దృష్టి అంతా యాక్టింగ్ పైనే ఉంది.
నన్ను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తారు..
కోడి రామకృష్ణ గారు కర్తవ్యం తరహా సినిమాలు ఎందుకు చేయడకూడదు అని నాతో అన్నారు. ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ మాటలే గుర్తుకొస్తాయి. సూర్యకాంతం సినిమా విడుదలయ్యాక నన్ను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తారనడంలో సందేహం లేదు.
ప్రచారం చేస్తా…
మా నాన్న తరపున ఈ సినిమా విడుదలయ్యాక ప్రచారం చేస్తాను. దాని కోసం నోట్స్ ప్రిపేర్ అవ్వాలి.