తెలుగులో కొత్త ఎంటర్టైన్మెంట్ ట్రెండ్ ఇదిగో..
పాతకు పాతరేసే రోజులు వచ్చేశాయ్. ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతున్న ఈ డిజిటల్ యుగంలో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ట్రెండ్‌కు తెరలేస్తోంది. సినిమాలు, చానల్స్ అన్నింటినీ.. ఇకపై ‘ఓటీటీ’ ద్వారా వీక్షించే సరికొత్త ట్రెండ్ మొదలైంది. ‘ఓటీటీ’ అంటే ఓవర్ ది టాప్. అంటే.. నెట్ ద్వారా టీవీల్లో, ఫోన్లలో, సిస్టంలో, ల్యాప్‌టాప్.. వంటి వాటిల్లో సినిమాలు, చానల్స్ అందించే నెట్వర్క్ అన్నమాట. ప్రస్తుతం మన ఇంట్లో ఉన్న టీవీలు కేబుల్ కలెక్షన్స్ లేదా ఇంటిపై పెట్టుకున్న డీటీహెచ్ ద్వారా ప్రసారాలు అందుకుంటున్నాము. ఇదే స్థానంలో నెట్ ద్వారా మనం చూడాలనుకున్న చానల్గానీ, సినిమాగానీ చూసుకునే వీలును కల్పిస్తుంది ‘ఓటీటీ’ వ్యవస్థ. డిజిటల్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) ట్రెండ్ భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది.
స్మార్ట్‌గా అందరిని అలరిస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో అమలు చేస్తున్నారు. అయితే మన దేశంలో ఇంటర్నెట్ వాడకం ఊపందుకోవడంతో ‘ఓటీటీ’ టెక్నాలజీ ప్రారంభమైంది. అయితే మన దేశంలో ఇంకా స్మార్ట్ టీవీలు ఎక్కువ లేవు. అయినా కూడా ఇండియాలో ఈ బిజినెస్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముంబయి, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలోల ఈ సర్వీస్ మొదలైంది. ప్రధానంగా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, స్మార్ట్ మల్టీప్లెక్స్, ఎరోస్ నౌ.. వంటి సంస్థలు ఈ సేవలందిస్తున్నాయి. కేబుల్‌తో పాటు డీటీహెచ్ వ్యవస్థలకు కాలం చెల్లిందనుకుంటున్న ప్రముఖ డీటీహెచ్ కంపెనీ డిష్‌టీవీ కూడా తాజాగా ‘వాచో’ పేరుతో ‘ఓటీటీ’లోకి అడుగుపెట్టేసింది. ఇటీవల టీవీ చానళ్లకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలు అమల్లోకి వచ్చాక ఓటీటీ వేగం మరింత పెరిగింది.
ఓటీటీ సంస్థలు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 30 పైచిలుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవి సినిమాలు, చానల్స్ ప్రసారంతో పాటు సొంతంగా సీరియళ్లు, సినిమాల్లాంటి కంటెంట్‌ను కూడా రూపొందిస్తూ వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
మన చెంతకు కూడా..
దక్షిణాదిలోనే తొలిసారిగా ‘ఓటీటీ’ సర్వీసును అందించేందుకు రంగంలోకి దిగిపోయింది SMARTMULTIPLEX.COM . అంతేకాదు స్మార్ట్ మల్టీప్లెక్స్ డాట్ కం ప్రస్తుతం ఉచితంగా సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇందులో లోకల్ కంటెంట్‌ను అందుబాటులో ఉంచింది. మరోవైపు ‘ఓటీటీ’ బిజినెస్‌లోకి నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్, మై హోమ్ అధినేత రామేశ్వరరావు.. వంటి వారు ఎంటరవుతున్నట్టు తెలుస్తోంది. కొత్త సినిమాను కేవలం థియేటర్లోనే విడుదల చేయాలన్న పద్దతికి చెక్ చెప్పే సర్వీసుగా ‘ఓటీటీ’ సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందనడంలో సందేహం లేదు.
భవిష్యత్ ప్రభంజనం..
రాబోయే ఐదేళ్లలో ఖచ్చితంగా కేబుల్, డీటీహెచ్ సగానికి పడిపోతాయి అనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా. రానున్న ఐదు సంవత్సరాల్లో డిష్, కేబుల్స్ పోయి ఎక్కువ శాతం ‘ఓటీటీ’ని వాడతారనే అంచనాలు వెలువడుతున్నాయి. 2022 నాటికి భారతీయ వీడియో ‘ఓటీటీ’ మార్కెట్ సుమారు రూ. 5,363 కోట్ల స్థాయికి చేరుకుని అంతర్జాతీయంగా టాప్-10లో నిలుస్తుందని అసోచామ్-పీడబ్ల్యూసీ సంయుక్తంగా రూపొందించిన నివేదిక అంచనా వేసింది. 2018లో 32.5 కోట్ల మంది ఆన్లైన్ వీడియోలు వీక్షించారు. ఇది అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 25 శాతం అధికం. వచ్చే మూడేళ్లలో డిజిటల్ వీడియో వినియోగదారుల సంఖ్య 50–60 కోట్లకు చేరగలదన్న అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి మీడియా రంగంలో ‘ఓటీటీ’ సరికొత్త విప్లవానికి తెరతీస్తోంది.